శనివారం 28 మార్చి 2020
Medak - Feb 14, 2020 , 00:13:07

పోచారం అభయారణ్యం అద్భుతం

పోచారం అభయారణ్యం అద్భుతం
  • సహజ సంపదకు ఆటంకాలు లేకుండా అభివృద్ధి చేయాలి
  • సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు
  • రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరించాలి
  • అటవీ భూముల రక్షణకు డివిజన్ల వారీగా మ్యాప్‌లు తయారు చేయాలి

హవేళిఘనపూర్‌ : జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న హవేళిఘనపూర్‌ పోచారం వన్యప్రాణి అభయారణ్య అందాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పోచారం అభయారణ్యాన్ని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, అటవీ శాఖ సీసీఎఫ్‌ లు అరున్‌ డోబ్రియేల్‌, శోభ, సీఎంవో ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌లతో కలిసి ప్రత్యేక వాహనంలో పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెదక్‌ అటవీ విస్తీర్ణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు గాను ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


వివాదాలు ఉన్న ప్రాంతంలో అటవీ రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేసి సత్వరం పరిష్కరించాలన్నారు. అటవీ సంపదను డివిజన్ల వారీగా మ్యాపులు సిద్ధం చేసి అటవీ విస్తీర్ణాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో అధికారులతో కలిసి ప్రత్యేక వాహనంలో తిరిగి సందర్శించారు. అక్కడే ఉన్న వాచ్‌ టవర్‌పై నుంచి అడవి అందాలను చూసి సంతోషించారు. అభయారణ్యంలోని నీటి తొట్లలో నీటిని నింపేందుకు గాను సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్‌ శరవణన్‌, మెదక్‌ ఆర్డీవో సాయిరామ్‌, తహసీల్దార్‌ వెంకటేశం, ఇరిగేషన్‌ అధికారి శ్రీహరి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.  


logo