బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 14, 2020 , 00:12:23

ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు

ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు
  • మెదక్‌ రీజియన్‌ పరిధి నుంచి 150
  • మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌
  • హైదరాబాద్‌ రీజియన్‌ పరిధి నుంచి 50 ప్రత్యేక బస్సులు

మెదక్‌ అర్బన్‌ : ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఏడుపాయలల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని మెదక్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని బస్సు డిపోల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో మెదక్‌ డిపో డీఎం జాకీర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏడుపాయల జాతరకు మెదక్‌ రీజియన్‌ పరిధిలోని మెదక్‌, సంగారెడ్డి, గజ్వేల్‌, నారాయణఖేడ్‌, సిద్దిపేట, దుబ్బాక, ప్రజ్ఞాపూర్‌ డిపోల నుంచి 150 వరకు ప్రత్యేక బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడుపనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌ రీజియన్‌ పరిధి నుంచి 50 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏడుపాయల జాతర ప్రత్యేక బస్సుల చార్జీల షీట్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రయాణికులు ఏడుపాయల ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్‌ రీజియన్‌ పరిధిలోని డిపో మేనేజర్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ పాల్గొన్నారు. 


పోతంశెట్‌పల్లిలో ఏర్పాట్లు

కొల్చారం: ఏడుపాయల జాతర కోసం కొల్చారం మండలంలోని పోతంశెట్‌పల్లి వైపు పార్కింగ్‌కు కురవగడ్డపై స్థలాన్ని పోలీసు అధికారులు గురువారం చదును చేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏడుపాయల వనదుర్గాభవానీ జాతర సాగనున్నది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఈనెల 19వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జంటనగరాలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పోతంశెట్‌పల్లి వైపు నుంచి జాతరకు వెళ్లే భక్తుల వాహనాలు బ్రిడ్జి దాటగానే కురవగడ్డపై పార్కింగ్‌ చేసేందుకు వీలుగా స్థలాన్ని కొల్చారం, పాపన్నపేట ఎస్‌ఐలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి డోజర్‌లతో చదును చేయించారు.


logo