శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 13, 2020 , 00:16:19

అటు ఏకగ్రీవాలు..ఇటు గెలుపు సన్నాహాలు

అటు ఏకగ్రీవాలు..ఇటు గెలుపు సన్నాహాలు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం గులాబీ పార్టీదే. అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా మున్సిపల్‌ ఎన్నికల వరకు జెట్‌ స్పీడ్‌తో కారు దూసుకెళ్లింది. తాజాగా సహకార ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే నామినేషన్ల  ప్రక్రియ పూర్తి కాగా కోనాపూర్‌, వరిగుంతం, కొంగోడ్‌, రంగంపేట, మాచవరం సహకార సంఘాలను టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకున్నది. మరో 11 సహకార సంఘాల్లో మెజార్టీ టీసీలు ఏకగ్రీవమవగా వీటిలోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులదే ఆధిపత్యం. ఈ లెక్కన 16 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. పోలింగ్‌ తర్వాత అన్ని సహకార సంఘాలను క్లీన్‌స్వీప్‌ చేసేలా గులాబీ పార్టీ అడుగులు వేస్తున్నది. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రామాయంపేట పీఏసీఎస్‌లో 10 టీసీలు, జంగరాయిలో 11, నార్సింగిలో 7, శివ్వంపేటలో 11, తూప్రాన్‌లో 10, వెల్దుర్తి 8, మహమ్మద్‌నగర్‌ 6, సోమక్కపేటలో 4, కొల్చారంలో 10, కిష్టాపూర్‌ 8, అంసానిపల్లిలో 11, పాపన్నపేట 8, చీకోడ్‌ 8 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తున్నది. 37 సహకార సంఘాలకు 481 డైరెక్టర్ల స్థానాలకు 237 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 244 డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నది.


logo