బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Feb 12, 2020 , 01:20:19

పల్లెలకు నిధుల పండుగ

పల్లెలకు నిధుల పండుగ

మెదక్‌ కలెక్టరేట్‌ : పల్లెల అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల అయ్యాయి. కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ , ఎస్టీల అభివృద్ధి నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పంచాయతీ కార్యాలయానికి విడుదలైన నిధులను జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు డీటీవో కార్యాలయాల్లో జమచేశారు. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన, కొత్తగా ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం మొక్కల పెంపకానికి అవసరమైన నీరు పెట్టడానికి పెద్ద పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే జిల్లాలలోని చాలా పంచాయతీలకు ట్రాక్టర్లను సరఫరా చేశారు. ప్రసుత్తం ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల కావడంతో మిగిలిన పంచాయతీలకు కూడా పంచాయతీ స్థాయిలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకోవాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు వెచ్చించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి, డీపీవో హనోక్‌లు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. 


14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.31కోట్లు విడుదల.. 

14వ ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్‌ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడుతలో రూ.10.31 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ నుంచి మూడో విడుతలో రూ.3.30 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఎస్సీ ఉపప్రణాళిక నుంచి రూ.1.24 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక నుంచి రూ.60.18లక్షలు కేటాయించారు. మూడు నెలల సర్పంచుల వేతన బాకాయిల కోసం రూ.70.35లక్షల చొప్పున విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులను గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. 


జనాభా ప్రకారం పంచాయతీలకు నిధులు.. 

  • గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న జనాభా ప్రకారం ఈ నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు మొదటి విడుత, అక్టోబర్‌ నుంచి మార్చి వరకు రెండో విడుత కేంద్రం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ నిధుల నుంచి నిధులను విడుదల చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా ఆధారంగా వీటిని గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. ఒక్కొక్కరికీ రూ.167 చొప్పున నిధులు వచ్చాయి. ఎక్కువ మంది జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ఎక్కువగా, తక్కువ జనాభా ఉన్న వాటికి తక్కువగా నిధులు కేటాయిస్తారు. వీటిని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో ఖర్చు చేయనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల చేయడంతో పల్లెల్లో సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మార్గం ఏర్పడింది. 
  • ఈ నిధులతో ఏఏ పనులు చేపట్టాలంటే.. 
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో ఏఏ పనులు చేపట్టాలనే విషయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులలో సూచించారు. 
  • తాగునీరు సరఫరా, పైప్‌లైన్ల మరమ్మతు, నీటి ట్యాంకుల చుట్టూ శుభ్రత, పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్ల నిర్వహణ, పుట్‌పాత్‌లు, కల్వర్టుల నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాల నిర్మాణం, బోర్ల మరమ్మతు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొరుగు సేవలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల చెల్లింపు, కోసం ఈ నిధులు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. 
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కూడా ఈ నిధులు ఖర్చు చేసేందుకు వెసులుబాటు కల్పించారు.
  • ట్రాక్టర్ల కొనుగోలుకు ప్రాధాన్యం ‘పల్లెప్రగతి’లో గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు జిల్లాలోని కొన్ని పంచాయతీల్లోనే ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో మిగిలిన పంచాయతీల్లో కూడా పంచాయతీ స్థాయికి అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేయాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. 


సర్పంచుల గౌరవ వేతనాలు విడుదల..

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సర్పంచులకు  గౌరవ వేతనాలను మంజూరు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని మూడోవిడుత వేతనాలను విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన బకాయిలు వచ్చాయి. ప్రతి నెల రూ.5వేల చొప్పున మూడు నెలలకు సంబంధించిన వేతనాలు విడుదల అయ్యాయి. మెదక్‌ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల సర్పంచులకు చెందిన గౌరవ వేతనం సుమారు. రూ.70.35లక్షలను జిల్లా పంచాయతీ అధికారులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 


గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ..

గ్రామ పంచాయతీలకు మంజూరైన వివిధ రకాల నిధులను పంచాయతీల ఖాతాల్లో జమచేయడం జరుగుతున్నది. వివిధ పద్దుల కింద గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను గ్రామ సర్పంచులు, పాలకమండలి సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పారద్శకంగా వినియోగించాలి. ముఖ్యంగా ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ట్రాక్టర్ల కొనుగోలు కోసం వెచ్చించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. సర్పంచుల మూడు నెలల గౌరవ వేతనం కూడా పంచాయతీల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. 

- హనోక్‌, జిల్లా పంచాయతీ అధికారి


logo
>>>>>>