మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 10, 2020 , 23:49:31

పంచాయతీ కార్మికులకు బీమా

పంచాయతీ కార్మికులకు బీమా

మెదక్‌, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగును నింపనున్నారు. అంతేకాకుండా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. రోడ్లను ఊడ్చి, మురికి కాలువలను శుభ్రం చేసి కేవలం వందల వేతనాలతో జీవితం గడిపేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. వారికి వేతనంతో పాటు బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 నుంచి 2015 వరకు కొన్ని పంచాయతీల్లో విడుతల వారీగా రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వేతనాలను పెంచారు. అయితే సీఎం కేసీఆర్‌ పల్లెలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పల్లెల్లో పారిశుద్ధ్య కార్మికుల జీవనంపై దృష్టి పెట్టారు. గ్రామాలకు వచ్చే నిధుల నుంచి వారికి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడి వేతనం రూ.8500 పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. 


జిల్లాలో వెయ్యి మందికి బీమా 

జిల్లాలోని 20 మండలాల్లో 469 గ్రామ పంచాయతీల్లో సుమారు వెయ్యి మంది పారిశుద్ధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 59 ఏండ్ల వయస్సులోపు కార్మికులు సుమారు వెయ్యి మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే మొదటి విడుతగా 630 మందికి ఒక ఏడాది బీమా కల్పించేందుకు నివేదికలు సిద్ధమయ్యాయి. రెండో విడుతలో కూడా మిగతా వారికి బీమా సౌకర్యం కల్పించనున్నారు. గ్రామాల వారీగా కార్మికులను గుర్తించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఈ జాబితాను ప్రభుత్వానికి అందించారు. 


ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బీమా డబ్బులను ప్రభుత్వమే చెల్లించనున్నది. దీని కోసం ఏటా ఒక్కో కార్మికుడికి రూ. 769 చొప్పున ఎల్‌ఐసీకి చెల్లించనున్నది. ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల బీమా వర్తింపజేయనున్నది. ఏటా దీనిని రెన్యూవల్‌ చేయనున్నారు. కార్మికుల తరఫున బీమా ప్రీమియం కోసం ప్రభుత్వం ఏటా రూ.2,42,54,260 చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా ఈ డబ్బు విడుదల కాగానే ఈ నెల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు బీమా వర్తించనున్నది.


రూ.2 లక్షల బీమా..

జిల్లాలోని సుమారు వెయ్యి మంది పారిశుధ్య కార్మికులకు భీమా సౌకర్యాన్ని సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్నారు. మొదటి విడతలో 630 మంది పారిశుద్ధ్య కార్మికుల జాబితాను ప్రభుత్వానికి పంపడం జరిగింది. మిగతా వారి వివరాలు సైతం పంపనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసే కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబానికి అండగా  ఉండడానికి భీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏటా రూ.769 చొప్పున భీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల భీమా వర్తిస్తుంది.

- హనోక్‌, డీపీవో


logo
>>>>>>