శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Feb 10, 2020 , 00:47:08

సహకార సంఘాల టీఆర్‌ఎస్‌

సహకార సంఘాల టీఆర్‌ఎస్‌

జిల్లాలోని 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పావులు కదుపుతున్నాయి. సాధ్యమైనంత వరకు డైరెక్టర్‌ పదవులను ఏకగ్రీవం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలేవైనా విజయదుందుబిని మోగిస్తున్న గులాబీ పార్టీ సహకార ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కసరత్తు చేస్తున్నది. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, రామలింగారెడ్డితోపాటు ముఖ్యనేతలంతా ఎప్పటికప్పుడు ఏకగ్రీవాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్‌ నియోజకవర్గంలోని కొల్చారం మండలంలో వరిగుంతం, కొంగోడు సహకార సంఘాల్లో డైరెక్టర్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ దాఖలు కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెదక్‌ ఉమ్మడి జిల్లాకు ఒకటే డీసీసీబీ బ్యాంకు ఉండటంతో అత్యధిక స్థానాలను గెలిపించుకొని డీసీసీబీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నేడు నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి మరిన్ని సహకార సంఘాలు, కొన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తున్నది.

  • 37 సహకార సంఘాల చైర్మన్‌ పదవులను దక్కించుకునేలా ప్రణాళికలు
  • సహకార ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మున్ముందుకు...
  • మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు కార్యకర్తలతో సమావేశాలు
  • సహకార సంఘాల ఏకగ్రీవానికి కసరత్తు..
  • ఇప్పటికే జిల్లాలో మూడు సహకార సంఘాల పాలకవర్గాలు ఏకగ్రీవం
  • నేటి ఉపసంహరణ గడువుతో ఏకగ్రీవాలు పెరిగే అవకాశం


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీదే విజయం. పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు ఎమ్మెల్యేల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వరకు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. సహకార సంఘాల ఎన్నికల్లో సైతం తమ సత్తా చాటాలని టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ పట్టుతో ఉన్నది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్వగ్రామం కోనాపూర్‌లో పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమయ్యింది. ఇప్పటివరకు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి తిరిగి చైర్మన్‌ కానున్నారు. 13 మంది డైరెక్టర్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ రావడంతో ఇక్కడ ఏకగ్రీవమయ్యింది. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని కొల్చారం మండలంలో వరిగుంతం, కొంగోడు సహకార సంఘాల్లో డైరెక్టర్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ దాఖలయ్యాయి. ఇవి కూడా ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం మూడు సహకార సంఘాలు గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 37 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. మెదక్‌ ఉమ్మడి జిల్లాకు ఒకటే డీసీసీబీ బ్యాంకు ఉండటంతో అత్యధిక స్థానాలు జిల్లాలో గెలిపించుకుని డీసీసీబీ చైర్మన్‌ పదవి టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడూ టీఆర్‌ఎస్‌ మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులతో మాట్లాడి నామినేషన్లు వేయించారు. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి ఒక్కరే పోటీలో ఉండేవిధంగా లేదా ఏకగ్రీవానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మూడు సహకార సంఘాల డైరెక్టర్లతో పాటు 75 టీసీలకు సింగిల్‌ నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవం కానున్నాయి. తూప్రాన్‌, నార్సింగి, చేగుంటతో పాటు టేక్మాల్‌, రేగోడ్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లో సైతం ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, రామలింగారెడ్డిలు సైతం కృషి చేస్తున్నారు. తూప్రాన్‌లో రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలు ఏకగ్రీవం కోసం కృషి చేస్తున్నారు.

లేదంటే పోటీల్లో నిలిపి అభ్యర్థులను గెలిపించుకునేల పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. మెదక్‌ నియోజకవర్గంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి పర్యవేక్షణలో సహకార సంఘాల అభ్యర్థుల ఎంపిక గెలుపు కోసం చొరవ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట, హవేళిఘనపూర్‌, మెదక్‌, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల నాయకులతో మాట్లాడుతున్నారు. కుదిరితే పాలకవర్గం మొత్తం డైరక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లేదంటే వీలైనన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు అభ్యర్థులు టీసీ స్థానాలకు పోటీ పడుతుండటంతో ఎమ్మెల్యేలకు, టీఆర్‌ఎస్‌ నాయకులకు అందరితో కలిసి మాట్లాడి గెలిచే అభ్యర్థినే బరిలో ఉంచాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. 10వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి మరిన్ని సహకార సంఘాలు, కొన్ని డైరెక్టర్‌ స్థానాలకు ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తున్నది. ఏదీ ఏమైనా జిల్లాలో 37 సహకార సంఘాల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చైర్మన్లుగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

ఎన్నికలు ఏవైనా  టీఆర్‌ఎస్‌దే హవా..

ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ను అందిస్తున్నారు. రైతుల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను రైతులు ఎప్పటికీ మరిచిపోరు. అంతేకాకుండా ‘కాళేశ్వరం’ నీటితో మెదక్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే జిల్లాలోని 37 సహకార సంఘాల్లో డైరెక్టర్లను గెలుచుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకుంటాం.  


logo