శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 10, 2020 , 00:44:47

నులిపేద్దాం

నులిపేద్దాం
  • జిల్లాలో 7 లక్షల 29వేల మందికి
  • మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
  • నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం

మెదక్‌, నమస్తే తెలంగాణ : ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నది. పిల్లల్లో రక్తహీనతను నివారించి పోషకాహార ఉపయోగితను మెరుగు పర్చేందుకు తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలి. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవ్సతరాల వయస్సు కలిగిన పిల్లలకు ఉచితంగా నులి పురుగుల మాత్రలు ‘అల్బెండజోల్‌' వేసేందుకు ఆరోగ్య సిబ్బంది మీ వద్దకు వస్తారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రల ‘అల్బెండజోల్‌'ను వేయడం జరుగుతున్నది. మొదటి రోజు అందుబాటులో లేని పిల్లలకు ఈ నెల 11, 12వ తేదీల్లో నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తారు.

జిల్లాలో 7,29,362 మంది..  3,442 మంది వలంటీర్లు..

జిల్లాలో  7,29,362 మందికి అల్బెండజోల్‌తో పాటు బోధకాల నివారణ మందులను పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను 3,442 మంది వలంటీర్లను నియమించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో, జూనియర్‌ కళాశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రలు వేయనున్నారు.

అపరిశుభ్రతతోనే నులి పురుగుల సంక్రమణ...

ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే  నులి పురుగులు వ్యాపిస్తాయి. చేతి గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి, గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి. అలా చేయకపోవడం వల్ల వాటిలో మట్టి చేరి అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగే పరిశుభ్రమైన నీరు తాగాలి, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి, ఆహార పదార్థ్ధాలపై ఎల్లప్పుడూ మూతలు కప్పి ఉంచాలి.

నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు...

ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో నులి పురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు, వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తున్నది. 

పిల్లల్లో మూడు రకాల నులిపురుగులు కనబడతాయి..

ఏలిక పాములు

నులి పురుగులు

కొంకి పురుగులు ఉంటాయి.

ప్లిలల్లో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడుతాయి. అందులో ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు ఉంటాయి. వీటిని నిర్మూలించేందుకు అల్బెండజోల్‌ మాత్రలు తప్పకుండా వేయాలి.  మాత్రను భోజనం తర్వాత వేసుకొని చప్పరించి మింగాలి.

సూచనలు...

1. మాత్రలు అందించడానికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి.

2. మాత్రలు నేరుగా మింగకూడదు. తప్పనిసరిగా మాత్రలు చప్పరించి మింగాలి. ప్రతి చోట శుభ్రమైన తాగునీరు తాగడానికి ఉంచాలి.


  • ప్రతి విద్యార్థి మాత్రను చప్పరించి, నమిలి మింగే విధంగా వ్యక్తిగతంగా గమనించాలి. ఏ విద్యార్థి మాత్రను ఉమ్మి వేయకుండా చూడాలి.
  • -దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు మాత్రలు అందించకూడదు.
  • -ముందు రోజున ఇంట్లో ఈ మాత్రలు వాడినప్పటికీ తిరిగి పాఠశాలలో మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలి.
  • -6-19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సగం మాత్ర లేదా సిరప్‌ అందించాలి.
  • -కడుపులో నులి పురుగులు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి ప్రతి కూల ఘటనలు కనపడవచ్చు. అవి తాత్కాలికమే. అటువంటి పిల్లలకు నీడలో విశ్రాంతి ఇవ్వాలి.
  • -సబ్బుతో చేతులు  శుభ్రం చేసుకోవడంపై అవగాహన పెంచండి. ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజం నెలకొల్పాలి.


అల్బెండజోల్‌ మాత్రల  కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 1 నుంచి 19 ఏండ్ల వయస్సు పిల్లలందరూ నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పటికే నులి పురుగు నివారణ కోసం అల్బెండజోల్‌ మాత్రలు ఏ విధంగా వేయాలో సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో మెదక్‌ 


logo