సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 23:55:12

నామినేషన్ల ఘట్టం ముగిసింది

నామినేషన్ల ఘట్టం ముగిసింది
  • జిల్లాలో 37 సహకార సంఘాలకు మొత్తం 1240 నామినేషన్లు
  • అదే రోజు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
  • మూడు సొసైటీల డైరెక్టర్ల స్థానాలకు ఒక్కో నామినేషన్‌
  • కోనాపూర్‌, వరిగుంతం, కొంగోడు సొసైటీల చైర్మన్‌ పదవులు గులాబీ ఖాతాలోకి...
  • ఈ నెల 9వ తేదీన పరిశీలన, 10న ఉపసంహరణ

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజున 39 అంతంత మాత్రంగానే ఉన్నా రెండో రోజు 416 నామినేషన్లు, చివరి రోజు శనివారం 785 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో మూడు సహకార సంఘాలకు సంబంధించి 39 డైరెక్టర్‌ స్థానాల్లో ఒక్కో నామినేషన్‌ దాఖలు కావడంతో ఇవి ఏకగ్రీవం కానున్నాయి.  నర్సాపూర్‌ నియోజకవర్గంలోని వరిగుంతం, కొంగోడు సహకార సంఘాల్లో ఉన్న మొత్తం డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది. దీంతో ఈ రెండు సహకార సంఘాలు ఏకగ్రీవం కానున్నాయి. అదే విధంగా మెదక్‌ నియోజకవర్గం రామాయంపేట మండలం కోనాపూర్‌ సహకార సంఘానికి 13 డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది. ఈ సహకార సంఘానికి ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి  చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మళ్లీ చైర్మన్‌గా దేవేందర్‌రెడ్డే ఎన్నిక లాంఛనమే కానున్నది. మూడు సార్లు కోనాపూర్‌ సహకార సంఘానికి చైర్మన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా చివరి రోజు శనివారం 785 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 481 డైరెక్టర్‌ పదవులకు మూడు రోజులుగా మొత్తం 1240 నామినేషన్లు దాఖలయ్యాయి. 


చివరి రోజు శనివారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. అదే రోజున సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మొత్తం 37 సహకార సంఘాల్లో 481 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా మొదటి రోజు 6వ తేదీన 39, రెండోరోజు 7వ తేదీన 416, మూడో రోజు 8వ తేదీ చివరి రోజు శనివారం మధ్యాహ్నం 3గంటల వరకు 785 నామినేషన్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా సహకార సంఘాల వద్ద నామినేషన్‌ వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ముందస్తు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. రిటర్నింగ్‌ అధికారులు, సొసైటీ సిబ్బంది నామినేషన్‌ పత్రాల స్వీకరణ సమయంలో అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. 


జిల్లాలో 37 సహకార సంఘాలకు దాఖలైన నామినేషన్‌లను ఈ నెల 9వ తేదీన నామినేషన్‌ల పరిశీలన చేయడం, 10వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజున పోటీలో ఉన్న అర్హులైన అభ్యర్థులను ప్రకటించడం, సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుంది. అనంతరం మూడు రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 15వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజున మధ్యాహ్న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సహకార ఎన్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే కలెక్టర్‌ ధర్మారెడ్డి నేతృత్వంలో చేశారు. 


బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు..

జిల్లాలోని 37 సహకార సంఘాలకు బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగించేందుకు అధికారులు నిర్ణయించారు. అందువల్ల బ్యాలెట్‌ పేపర్లలో పార్టీలకు చెందినవి కాకుండా స్వతంత్ర గుర్తులు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆయా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. సహకార ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు సైతం సిద్ధం చేశారు. ఇప్పటికే వాటిని ఆయా సహకార సంఘాలకు తరలించారు. 


మూడు సొసైటీల చైర్మన్‌ పదవులు గులాబీ ఖాతాలోకే..

జిల్లాలో మూడు సహకార సంఘాల పాలక వర్గాలను గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. అధికారికంగా అధికారులు ప్రకటించకున్నా.. మూడు సహకార సంఘాలకు మొత్తం డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది. మొత్తం డైరెక్టర్‌ పదవులన్నీ ఏకగ్రీవం కానున్నాయి. దీంతో మూడు సహకార సంఘాల పాలకవర్గాలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్‌ సహకార సంఘానికి 13 డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది. దీంతో ఇక్కడ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవం కానున్నది. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని వరిగుంతం, కొంగోడు సహకార సంఘాల్లో ఉన్న మొత్తం డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది.  దీంతో ఈ రెండు సహకార సంఘాలు ఏకగ్రీవం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం లాంచనమే కానున్నది. ఈ రెండు సహకార సంఘాల పాలక వర్గాలు గులాబీ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమైంది.


logo