గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 02:23:34

అన్ని రంగాల్లో అభివృద్ధి

అన్ని రంగాల్లో అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మెదక్‌ను అభివృద్ధి చేసుకుందామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్‌ మున్సిపాలిటీ తొలి సమావేశం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, అతిథులుగా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్‌లో నాలుగు లేన్ల రోడ్డు, రైతు బజార్‌ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. పట్టణ శివారులో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్‌కు రింగురోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారని, త్వరలో నిధులు మంజూరవుతాయని మంత్రి తెలిపారు. సింగూరు నీటితో ఉమ్మడి జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ‘కాళేశ్వరం’ నీటిని జిల్లాలోని హల్దీ, మంజీరాకు మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీంతో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. త్వరలో ఇంటింటికీ మంజీరా నీరు అందుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమెదక్‌గా మారుద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేపద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వరుస ఎన్నికలతో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చుదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు జిల్లా కేంద్రంలో రూ.38 లక్షలతో నిర్మించిన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏడుపాయలలో శివరాత్రికి జరుగనున్న జాతర గురించి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

 • కలిసికట్టుగా మెదక్‌ రూపురేఖలు మారుద్దాం : మంత్రి
 • నాలుగు వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు
 • మెదక్‌లో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్క్‌ట్‌కు కృషి
 • రైతు బజార్‌ నిర్మాణానికి రూ. కోటి కేటాయించి పనులు పూర్తి చేస్తాం
 • ‘కాళేశ్వరం’ జలాలతో శాశ్వత తాగునీటి కొరత లేకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు
 • హల్దీ, మంజీరాలకు ‘కాళేశ్వరం’ జలాలు
 • మెదక్‌ మున్సిపల్‌ తొలి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
 • ప్రజల భాగస్వామ్యంతో మెదక్‌ ను అభివృద్ధి చేద్దాం
 • ‘పల్లెప్రగతి’ మాదిరిగా త్వరలో పట్టణ ప్రగతి
 • సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి
 • నూతన చైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన తొలి సమావేశ

 మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కలిసికట్టుగా మెదక్‌ బల్దియాను అభివృద్ధి చేద్దామని.. అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా ముం దుకెళ్దామని ఎల్లవేళలా మెదక్‌ అభివృద్ధికి శాయశక్తులా సహకరిస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్‌ బల్దియా తొలి సమావేశం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జేసీ నగేశ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌  మల్లికార్జున్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్‌ మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగూర్‌లో వేసవి కాలానికి సరిపడా 1.5 టీఎంసీల నీరు ఉందన్నారు. వాటిని పొదుపుగా వాడి తాగునీటి కొరత లేకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ శాశ్వతంగా తాగు, సాగు నీటి కొరత లేకుండా ‘కాళేశ్వరం’ ద్వారా జిల్లాలోని హల్దీ, మంజీరాకు మళ్లించేందుకు శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా ఏర్పాటుతో అన్ని రంగాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణం పనులు, మిషన్‌ భగీరథ, ఇతరత్రా అభివృద్ధి పనులపై త్వరలో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్సీ) కలెక్టర్‌, ఆయా శాఖల ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో ‘పల్లెప్రగతి’ మాదిరిగా పట్టణ ప్రగతిని ప్రభుత్వం చేపట్టనున్నదని మంత్రి తెలిపారు. పల్లెలకు ప్రభుత్వం ద్వారా నిధులు ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా పట్టణాలకు సైతం నిధులు రానున్నాయన్నారు. మెదక్‌కు రింగురోడ్డు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారని, త్వరలో నిధులు మంజూరు అవుతాయని మంత్రి తెలిపారు. మెదక్‌లో నాలుగు లేన్లరోడ్డు పనులతో పాటు మెదక్‌ రైతు బజార్‌కు రూ.కోటి కేటాయించి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అంతే కాకుండా వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మెదక్‌ పట్టణ శివారులో 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేసి మహిళకు, యువకులకు ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు. త్వరలో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తి చేయించి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అభివృద్ధి పనులతో పాటు ఏడుపాయల, చర్చి, పోచారం ప్రాజెక్ట్‌, అభయారణ్యాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నూతన కౌన్సిల్‌ సభ్యులు పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. మెదక్‌లో సీసీరోడ్ల నిర్మాణంతో పాటు శ్మశాన వాటికలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణాలకు కృషి చేస్తామన్నారు. కోతుల బెడద నిర్మూలనకు హిమచల్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన వారు ప్రయోగాత్మకంగా నిర్మల్‌లో చర్యలు తీసుకుంటున్నారని అది విజయవంతమైతే మెదక్‌లో సైతం కోతుల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

ప్రణాళికా బద్ధంగా వార్డులను అభివృద్ధి చేయండి.. 

కౌన్సిల్‌ తొలి సమావేశంలో 32 మంది కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమంతో పాటు సమావేశంలో మాట్లాడానికి మంత్రి హరీశ్‌రావు అవకాశం కల్పించారు. ఇందులో 11వ వార్డు కౌన్సిలర్‌ సమియొద్దీన్‌ దేవాలయం నిర్మాణానికి కృషి చేయాలని సభ దృషికి తేవడంతో మతసామరస్యాన్ని పాటించిన సమియొద్ద్దీన్‌ను మంత్రి అభినందించారు. అంతేకాకుండా వార్డు సమస్యలపై అనర్గళంగా మాట్లాడిన మహిళా కౌన్సిలర్లు ఆరేళ్ల గాయత్రి, రాగి వనజ, మేఘమాల, సులోచన ప్రభురెడ్డి, శంసున్నీషా బేగం, మానస, బట్టి లలిత, మేడి కల్యాణి, చందన సుమన్‌లు అందరిని ఆకట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్‌, ఆర్కె శ్రీనివాస్‌, కిషోర్‌, విశ్వంతో పాటు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, రాజలింగం, ఆవారి శేకర్‌ తదితర కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తేవడంతో మంత్రి హరీశ్‌రావు కౌన్సిలర్లను ప్రశంసించారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వార్డులో గల ప్రధాన సమస్యలను మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత అంశాలుగా నోట్‌ చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.  ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన వారికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్‌ చట్టం పొందుపరిచిన పుస్తకాలను కౌన్సిలర్లకు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందజేశారు. 

త్వరలో పారంభం కానున్న కలెక్టరేట్‌..

నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం పనులు త్వరలో పూర్తి కానున్నాయని, ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ వస్తారని అదే రోజు డబుల్‌ బెడ్‌రూంల ఇండ్లను సైతం సీఎం ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.  


మున్సిపల్‌ అభివృద్ధికి నిధులివ్వండి..

మెదక్‌ మున్సిపల్‌లోని పలు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు. పట్టణంలో సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణాలకు రూ.2కోట్లు ఇవ్వాలి. తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలను ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిల సహకారంతో పరిష్కరిస్తాం. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం పై అంతస్తులో సమావేశ మందిరం నిర్మాణానికి జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 

- మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌


పాలకవర్గం పట్టణ అభివృద్ధికి..  కృషి చేయాలి

నూతనంగా ఎన్నికైన మెదక్‌ మున్సిపల్‌  పాలకవర్గం పట్టణాభిద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. హరితహారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలి. అందరూ కలిసి స్వచ్ఛ మెదక్‌గా తయారు చేద్దాం. 

- ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి


మెదక్‌ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుదాం..

సీఎం కేసీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేసి అత్యధికంగా నిధులు ఇస్తున్నారు. మెదక్‌ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డిల సహకారంతో మెదక్‌ పట్టణం అభివృద్ధి జరుగుతుంది. పట్టణ తాగునీటి పరిష్కారానికి రూ.50 కోట్లు ప్రపంచ బ్యాంకు   నిధులతో పాటు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కింద మంజూరైన రూ.13 కోట్లతో పనులు జరుగుతున్నాయి. వరుస ఎన్నికలతో పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్‌ భగీరత పైప్‌లైన్‌ పనులు పూర్తవగానే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.  

- ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి


ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి కృషి చేయండి..

ప్రజల భాగస్వామ్యంతో నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి. తడి, పొడి చెత్తను సేకరించి పారిశుధ్య నివారణకు కృషి చేస్తూ స్వచ్ఛ మెదక్‌ను తయారు చేసుకుందాం. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మొక్కలు నాటి వాటిని పెంచాలి. ప్రభుత్వం పట్టణాభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం అవుదాం. 

- కలెక్టర్‌ ధర్మారెడ్డి


logo
>>>>>>