సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 08, 2020 , 02:34:59

రైల్‌ ట్రయల్‌ రన్‌

రైల్‌ ట్రయల్‌ రన్‌

జిల్లావాసుల రైలుకల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్‌ చొరవ కారణంగా మనోహరాబాద్‌-కొత్తపల్లి మార్గంలో రైల్వేలైన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు అన్ని పనులు పూర్తికాగా రైల్వే అధికారులు శుక్రవారం మనోహరాబాద్‌ నుంచి నాచారం వరకు ట్రయల్న్‌ నిర్వహించారు. శనివారం నాచారం నుంచి గజ్వేల్‌ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంకేతికంగా అన్ని పనులు పూర్తయితే మనోహరాబాద్‌-గజ్వేల్‌ మధ్య రైలు ప్రయాణం ఈ నెలాఖరులోపు అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్‌చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  • మనోహరాబాద్‌-గజ్వేల్‌ మార్గంలో రైలు నడిపిన అధికారులు
  • నేడు నాచారం-గజ్వేల్‌ వరకు..

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ/గజ్వేల్‌ అర్బన్‌: మనోహరాబాద్‌- గజ్వేల్‌ రైలు మార్గంలో రైల్వే అధికారులు శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మనోహరాబాద్‌ నుంచి నాచారం వరకు రైలు ఇంజన్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. నేడు నాచారం నుంచి గజ్వేల్‌ వరకు ట్రయల్న్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కల అయిన మనోహరాబాద్‌ -కొత్తపల్లి రైలు మార్గం సాకారమవుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలుమార్గాన్ని మంజూరు చేయించారు. దీనిలో భాగంగా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు రైలుమార్గం నిర్మాణం పూర్తయింది. శుక్రవారం మనోహరాబాద్‌ నుంచి నాచారం వరకు రైలింజన్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించి పరిశీలించారు. రైలు మార్గం నిర్మాణానికి సీఎం ప్రత్యేక చొరవతో అధికారులు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, గడ ఓఎస్డీ, ఆర్డీవో విజయేందర్‌రెడ్డిలతో పాటు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామగ్రామానికి వెళ్లి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూ యజమానులు కూడా రైలుమార్గ నిర్మాణంలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చి పూర్తి సహకారాన్ని ఇవ్వడంతో రైల్వే అధికారులు కూడా సీఎం ఆదేశాలతో పనులను పరుగులు పెట్టించారు. 

ఫిబ్రవరి చివరికల్లా..

మనోహరాబాద్‌ -గజ్వేల్‌ మధ్య రైలు ప్రయాణం ఫిబ్రవరి చివరివారంలోగా గజ్వేల్‌ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. మరో రెండు రోజుల్లో ట్రయల్‌ రన్‌ పూర్తి కానుండడంతో ఈనెల చివరి వారంలోగా రైలును ప్రారంభించనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి  అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారు.


logo