మంగళవారం 07 ఏప్రిల్ 2020
Medak - Feb 07, 2020 , T01:20

మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక కృషి

మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక కృషి

మెదక్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా మున్సిపాలిటీల్లో తాగునీరు, హరితహారం కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. పట్టణాభివృద్ధికి మున్సిపల్ చైర్మన్లు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయలను మంజూరు చేస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానంలో ఉండేలా మున్సిపల్ చైర్మన్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, డంపింగ్ యార్డులు, రహదారుల నిర్మాణాలు, మిషన్ భగీరథ పనుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు.  గడిచిన ఐదేండ్ల కాలంలో మున్సిపాలిటీలను అభివృద్ధి దిశగా నడిపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. 

మెదక్ పట్టణాభివృద్ధికి రూ.14 కోట్లతో ప్రతిపాదనలు...

మెదక్ మున్సిపాలిటీలో రూ.14 కోట్లతో ప్రతిపాదనలను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్‌కు అందజేశారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలోని పైఅంతస్తు నిర్మాణానికి రూ.కోటి 15 లక్షలు, చిల్డ్రన్స్ పార్కు వద్ద ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి, బ్లూస్టార్ వద్ద శానిటేషన్ స్టోర్‌కు రూ.50 లక్షలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.13 కోట్లు ఇంకా పట్టణంలో చెత్తను శుభ్రం చేసే మిషన్‌కు రూ.కోటితో ప్రతిపాదనలను అందజేశామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. 


logo