బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 07, 2020 , T01:10

నాటిన ప్రతి మొక్కను సంరక్షిచాలి

నాటిన ప్రతి మొక్కను సంరక్షిచాలి

మెదక్ కలెక్టరేట్ :లెక్కల కోసం మొక్కలు నాటకుండా.. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు చర్యలు తీసుకున్న రోజే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా గ్రీన్ యాక్షన్ ప్లాన్ 2020 సమావేశాన్ని కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి శాఖకు వేరువేరుగా మొక్కల లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందన్నారు. రానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క శాఖకు నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పల్లెప్రగతి కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాలేదని మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికీ ప్రారంభం కాని పనులు పర్యవేక్షించి సత్వరం పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగేలా మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా  సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు ప్రారంభం కాని మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడి త్వరగా స్థల సేకరణ పూర్తి చేసి అధికారులకు అప్పగించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో సీతారామారావు, డీఎఫ్‌వో పద్మజారాణి, డీపీవో హనోక్, జిల్లా అధికారులు డా.వెంకటేశ్వరరావు, రమేశ్, నర్సయ్య, కృష్ణమూర్తి, జయరాజు తదితరులు పాల్గొన్నారు.


logo