శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 06, 2020 , 01:47:19

శిల్ప సంపదకు నెలవు తుంబురీశ్వర ఆలయం

శిల్ప సంపదకు నెలవు తుంబురీశ్వర ఆలయం

టేక్మాల్‌: రాగాలు పలికే తుంబుర నాదాలు రాతి కట్టడాలు... అలనాటి చరిత్రకు సాక్షంగా నిలిచే శిలా శాసనాలు...  అద్భుతమైన కళాఖండాలు దేవాలయ ప్రాకారాలు... రాజ్యాలేలిన రాజుల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తున్న శాసనాలు, అప్పటి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన అపూర్వమైన కట్టడాల చారిత్రక నేపథ్యం... సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర పుటలో దాగివున్న సాంస్కృతిక వైభవం పరిఢవిల్లుతున్నది.  టేక్మాల్‌ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో వెలసిన తుంబురీశ్వర ఆలయం విశిష్టత, శిల్పకళానైపుణ్యం, చరిత్రను ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.


పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం.. దేవతల స్థావరంగా పిలిచే ఎత్తైన గుట్టలు... పక్షుల కిల కిల రావాలు... జలకళతో ఆహ్లాదంగా పరిచే చెరువు... చెరువు పక్కనే ఉన్న గుట్టపై నిర్మించబడిన తుంబురీశ్వర ఆలయం... ఆలయ నిర్మాణంలో అప్పటి శిల్ప కళా నైపుణ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎత్తైన గుట్టపై వెలసిన ఆలయం, కొండల మధ్యన చెరువు, పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయతను పంచుతూ పరవశింపజేస్తుంది. ప్రశాంత వాతావరణాన్ని పంచే ఇక్కడి గుట్టలపై దేవతలు (వేల్పులు) తపస్సు చేసేవారని స్థానికుల నమ్మకం. వేల్పులు గుండపై తపస్సు చేయడంతో వేల్పులగుట్టగా పేరు పొంది కాలక్రమేణా వేల్పుగొండ రూపాంతరం చెందిందని చెబుతుంటారు. 


తుంబురీశ్వర ఆలయం... శిల్పకళా ఖండం

చరిత్ర ఆధారాలను బట్టి తుంబురీశ్వర ఆలయాన్ని కల్యాణ చాళుక్యుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. అటు తరువాత 13వ శతాబ్దంలో పాలించిన కాకతీయుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందడంతో ప్రాచుర్యం పొందిందనే విషయాన్ని ఇక్కడి శాసనాల ద్వారా వ్యక్తమవుతుందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, తుంబురీశ్వర ఆలయం పై భాగంగాలో ఉన్న నిర్మాణం ఒకేలా ఉండటంతో  ఆలయం పూర్తిగా నల్లరాతితో అద్భుతంగా నిర్మించారు. ఆలయం గర్భగుడిలో శివలింగం ప్రతిష్టించబడింది. ఆలయం చుట్టూ బయటి భాగం గోడలపై అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ఈ శిల్ప నైపుణ్యం ఆధారంగానే కల్యాణ చాణక్యుల కాలంలో ఆలయం నిర్మించినట్లుగా చరిత్రకారులు నిర్ధారించారు. మహిశాసురమర్ధిని శిల్పం, నాట్య భంగిమలో స్త్రీలు, వివిధ ఆకృతులతో కనులవిందుగా రమణీయమైన శిల్ప సంపద ఇక్కడి ఆలయం గోడలపై కనిపిస్తుంది. గాన గంధర్వుడైన తంబురుడు ఇక్కడే జన్మించాడని, ఆయననే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించారని, అందుకే తుంబురీశ్వర ఆలయంగా పిలువబడుతున్నట్లుగా ప్రచారంలో ఉన్నది. 


అడుగడుగున చారిత్రక నేపథ్యం

వేల్పుగొండగా మారిన వేల్పుల కొండలో అడుగడుగున చారిత్రక నేపథ్యం సంతచరించుకుంది. గ్రామంలో ఎక్కడ చూసిన శిల్పాలు, దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. అంటే ఇక్కడ వెల్లివిరిసిన కల్యాణ చాళుక్యుల, కాకతీయ రాజుల వైభవం కనులకు కట్టినట్లుగా కనిపిస్తుంటుంది. గ్రామం నుంచి ఆలయానికి వెళ్లే దారిలో పెద్ద శివలింగం, గ్రామ పరిసర ప్రాంతాల్లోని చెరువు కట్టల వద్ద నాగదేవతల విగ్రహాలు, గణపతి విగ్రహాం దర్శనమిస్తాయి. ఇలా గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో శిల్పసందతో అప్పటి సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక వైభవాన్ని చాటి చెబుతున్నాయి. 


 ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 6వ తేదీ నుంచి తుంబురీశ్వర జాతర నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం బండ్లు, బోనాల ఊరేగింపు. 7వ తేదీన రుద్రాభిషేకం, పుష్పార్చన, సాయంత్రం పాచిబండ్ల ఊరేగింపు, 8వ తేదీన పల్లకీ సేవ, కుస్తీపోటీ, 9వ తేదీన మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలు, అన్నపూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త రావికోటి రామశర్మ తెలిపారు. logo