ఆదివారం 29 మార్చి 2020
Medak - Feb 05, 2020 , 00:55:48

సహకార ఎన్నికల్లో గులాబీ జెండా సత్తా చాటేందుకు సమాయత్తం

సహకార ఎన్నికల్లో గులాబీ జెండా సత్తా చాటేందుకు సమాయత్తం

మెదక్‌, నమస్తే తెలంగాణ :రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఎన్నికల కోలాహలం ఇంకా ఆగలేదు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. గడువు ముగిసినా ఇన్‌చార్జిలతో పాలన సాగిస్తున్న వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ సమాయత్తమయ్యారు. సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ కూడా విడుదలైంది. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తున్న సహకార సంఘాల ఎన్నికలను సైతం నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకార ఎన్నికల సమరానికి శంఖారావం పూరించింది.

ఏ ఎన్నికలైనా కారుదే జోరు..

రాష్ట్రంలో అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, పంచాయతీ, మున్సిపల్‌ ఇలా ఎన్నికలు ఏవైనా.. టీఆర్‌ఎస్‌దే హవా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరుముందు ప్రధాన ప్రతిపక్షం అంటూ చెప్పుకోకుండా పోయాయి. అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలోనూ అదే జరిగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. రాష్టంలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సీట్లను సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంది. ఇది జాతీయ రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ కారు జోరుముందు ప్రతిపక్షాలు నిలువలేకపోతున్నాయి. సహకార ఎన్నికలలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులనే విజయం వరించనున్నదని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు. సహకార ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు కూడా ఇతర పార్టీల మద్దతుదారులు సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. జిల్లాలోని 37 సహకార సంఘాల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు చైర్మన్లుగా ఆసీనులు కాబోతున్నట్లు ముందే అంచనా వేస్తున్నారు. 

దీంతో ఈ సారి పీఏసీఎస్‌ చైర్మన్ల కోసం భారీగానే పోటీ  నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గ్రామీణ స్థాయిలో మంచి పేరున్న వ్యక్తులకు, అలాగే గతంలో పార్టీ కోసం, రైతుల కోసం పనిచేసిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పార్టీ సీనియర్లకు సూచించినట్లు సమాచారం. మొత్తానికి సహకార ఎన్నికల సమరంలోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. 


logo