మంగళవారం 31 మార్చి 2020
Medak - Feb 03, 2020 , 23:43:40

రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట

రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట
  • ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం
  • నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్‌
  • అభ్యంతరాలు స్వీకరణకు నెల రోజుల గడువు
  • నెరవేరిన జోగిపేట వాసుల చిరకాల స్వప్నం
  • కొత్త మండలంగా చౌటకూర్‌
  • మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌

అందోల్‌, నమస్తే తెలంగాణ: జోగిపేట ప్రజల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కావాలన్న చిరకాల స్వప్నం నెరవేరింది. జోగిపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై  నెలరోజుల గడువులోగా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను సేకరించాలని, పత్రిక ప్రకటనను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్‌ హనుమంతరావుకు ఆదేశాలను జారీ చేశారు. 2018 నవంబర్‌ 28వ తేదీన సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సైతం ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులను కలుస్తూ, రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది ఫిబ్రవరి మాసంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషిని కలిసి వినతిపత్రం అందజేసి, డివిజన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.   


కొత్త మండలంగా చౌటకూర్‌.. 

అందోలు నియెజకవర్గ పరిధిలోని పుల్కల్‌ మండల పరిధిలోని చౌటకూర్‌ను 14 గ్రామాలతో కలుపుకుని కొత్త మండలంగా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పుల్కల్‌ మండంలోని పోసానిపల్లి, చౌటకూర్‌, శేరిరాంరెడ్డిగూడ, సుల్తాన్‌పూర్‌, సరాఫ్‌పల్లి, కొర్పోల్‌, లింగంపల్లి, అంగడిపేట్‌, తాడ్‌దాన్‌పల్లి, గంగోజీపేట, చక్రియాల్‌, శివ్వంపేట, వెండికోల్‌, హున్నాపూర్‌ గ్రామాలను వేరు చేసి, కొత్త మండలం చౌటకూర్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిపై  ఉన్న చౌటకూర్‌ మండల కేంద్రంగా మారడంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో చౌటకూర్‌ గ్రామస్తులు, ఆయా గ్రామాల ప్రజలు  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


నాలుగు మండలాలతో జోగిపేట రెవెన్యూ డివిజన్‌..

అందోలు నియోజకవర్గ కేంద్రం జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు ప్రభుత్వం లైన్‌ క్లియర్‌ చేసింది. నియోజకవర్గ పరిధిలోని అందోలు, వట్‌పల్లి, పుల్కల్‌, కొత్త మండలం వట్‌పల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు సేకరించనున్నారు. 


మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌..

అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని సీఎం కేసీఆర్‌ హామీనిచ్చి, మాటను నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018 నవంబర్‌ 28న జోగిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ డివిజన్‌గా జోగిపేటను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకుని, జోగిపేట ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత ఆయనకే దక్కుతున్నది. 


logo
>>>>>>