శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 03, 2020 , 23:41:01

సహకార ఓటర్లు @54,401

 సహకార ఓటర్లు @54,401

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార సంఘం ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో జిల్లాలోని 37 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు ఓటరు జాబితా, సొసైటీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో 37 సహకార సంఘాల్లో మొత్తం 481 డైరెక్టర్‌ స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 6వ తేదీ నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 9న నామినేషన్ల స్క్రూట్నీ, 10న ఉపసంహరణ, మధ్యాహ్నం 3 గంటల తర్వాత గుర్తులు కేటాయిస్తారు. 14వ తేదీ వరకు ప్రచారం ఉంటుంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 16న ఎన్నికైన డైరెక్టర్లు సొసైటీ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఇదిలావుండగా జిల్లాలోని 37 సహకార సంఘాల్లో 54,401 మంది ఓటర్లు ఉన్నారు. 37 సహకార సంఘాల్లోని 481 డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. అంతేకాకుండా జిల్లాలో 481 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 37 మంది ఎన్నికల అధికారులను నియమించినట్టు జిల్లా సహకార శాఖ అధికారి వై.పద్మ తెలిపారు. 


481 డైరెక్టర్లకు రిజర్వేషన్లు ఇలా...

జిల్లాలోని 37 సహకార సంఘాల్లో 481 మంది డైరెక్టర్లకు రిజర్వేషన్లను సహకార శాఖ అధికారులు ఖరారు చేశారు. ఇందులో 74 ఎస్సీలకు కాగా (37 మహిళలకు, 37 జనరల్‌కు) 37 ఎస్టీలకు, 74 బీసీలకు, 259 ఓసీలకు, 37 ఓసీ(మహిళలకు) కేటాయించారు. 


ప్రతి సొసైటీకి 13 మంది డైరెక్టర్లు...

జిల్లాలోని ప్రతి సొసైటీకి 13 మంది డైరెక్టర్లు ఉంటారు. ఇందులో ఎస్సీ జనరల్‌ 1, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్‌ 1, బీసీ జనరల్‌ 2, ఓసీ జనరల్‌ 7, ఓసీ మహిళా 1 చొప్పున ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరితో పాటు మరో ఐదుగురిని కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలు, మైనార్టీ ఒక్కరూ, అధికారులు ఇద్దరిని రిజిస్టార్‌ నామినేట్‌ చేస్తారు. మొత్తం 18 మంది సొసైటీ పాలకవర్గ సభ్యులుగా ఉంటారు.


గ్రామాల్లో మొదలైన సందడి...

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. ప్రతి సొసైటీ పరిధిలో నాలుగు నుంచి 8 గ్రామాలు ఉండడంతో అన్ని గ్రామాల్లో ఈ ఎన్నికల వాతావరణం మొదలైంది. ప్రతి గ్రామంలో ఎక్కువగా మంది అభ్యర్ధులు పోటీ పడే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఆయా గ్రామాల పరిధిలోని ఓటర్లను పోటీ చేసే అభ్యర్ధులు కలిసి తమను డైరెక్టర్‌గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. 


పోటీ చేసేందుకు అర్హులు వీరే..

- ఆయా సంఘాల పరిధిలోని గ్రామల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.

- 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

- 31 డిసెంబర్‌ 2018 నాటికి సభ్యుడై ఉండాలి.

- 31 డిసెంబర్‌ 2019 నాటికి సంఘంలో అప్పు ఓడీ (ఓవర్‌డ్రాప్ట్‌) అయి ఉండకూడదు.

- సంఘంలో రూ.330 సభ్యత్వ రుసుం చెల్లించి ఉండాలి.


logo