సోమవారం 30 మార్చి 2020
Medak - Feb 03, 2020 , 23:39:24

ప్రమాదాల నివారణకు చర్యలు

ప్రమాదాల నివారణకు చర్యలు

మెదక్‌, నమస్తే తెలంగాణ : జాతీయ రహదారి ప్రమాద మలుపుల (బ్లాక్‌ స్పాట్స్‌) వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ చందనదీప్తి అన్నారు. సోమవారం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై బ్లాక్‌ స్పాట్లను జిల్లా పోలీసు అధికారులతో కలిసి గ్రామాలకు వెళ్లే దారులను, ప్రమాదకర మలుపులను పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారి భద్రత అధికారులకు, పోలీసు అధికారులకు ప్రతి ప్రమాద మలుపుల (బ్లాక్‌ స్పాట్స్‌ ) వద్ద హెచ్చరికలను సూచించే బోర్డులను, స్టాపర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్‌ స్పాట్లలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులే బాధ్యత వహించి వెంటనే స్పందించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులపై ప్రమాదకర మలుపులు కలిగిన ప్రాంతాల్లోనే కాకుండా ఇరుకైన కల్వర్టులు, మూడు, నాలుగు రహదారులు కలిసే రద్దీ ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 


జిల్లాలోని జాతీయ రహదారికి సంబంధించిన కాళ్లకల్‌, మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట, రామాయంపేట అలాగే  జిల్లాలోని రాష్ట్ర ముఖ్య రహదారులు ఇంకా పలు అవసరమైన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అన్ని బ్లాక్‌ స్పాట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ప్రమాదాలు జరుగకుండా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు పరిశీలించడంతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్‌ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు యువకులకు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలని ప్రజల్లో ప్రమాద నివారణ అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందించి పనిచేయాలన్నారు. జిల్లా సిబ్బంది ఇదే బాధ్యతతో ప్రజల భాగస్వామ్యతో కలిసి ముందుకు సాగినట్లయితే రాష్ట్రంలోనే పూర్తి స్థాయి ప్రమాదాల నివారణ జిల్లాగా మెదక్‌ జిల్లాకు గుర్తింపు వస్తుందని ఎస్పీ అన్నారు. 


logo