బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Feb 02, 2020 , 23:50:15

సహకార సమరానికి సర్వం సిద్ధం

సహకార సమరానికి సర్వం సిద్ధం
  • జిల్లాలో 37 సంఘాలకు ఎన్నికలు
  • నేడే నోటిఫికేషన్‌ విడుదల
  • ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • నేడు ఓటరు జాబితాను విడుదల చేయనున్న అధికారులు

మెదక్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర సహకార సంస్థ ఎన్నికలు జరిగే సొసైటీల జాబితాను వెలువరించింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో సంబంధిత శాఖ అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. మెదక్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఉన్న పాత 37 సహకార సంఘాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో సభ్యులుగా ఉన్న రైతుల ఓటర్ల లిస్టును సొసైటీల వారీగా సిద్ధం చేశారు. అలాగే సొసైటీలకు చైర్మన్‌లుగా ఉండాలని ఆశిస్తున్న ఆశావహులు తన వారి పేర్లు ఓటరు లిస్టులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సొసైటీల ఎన్నికల్లోనూ అధికారి పార్టీ నుంచే ఎక్కువ మంది పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీలో ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉన్నాయి.


కొత్తగా ఏర్పడే సొసైటీలకు ఎన్నికలు లేనట్టే...

రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా సహకార సంఘం ఎన్నికలపై దృష్టి సారించడం, వెనువెంటనే నోటిఫికేషన్‌ జారీ కావడంతో కొత్తగా ఏర్పడే సొసైటీలకు ఎన్నికలు జరిగేలా లేవని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఇప్పటికే 37 సహకార సంఘాలు ఉండగా, మరో 15 సహకార సంఘాలు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాధనలు సిద్ధం చేశారు. అయితే వాటికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో పాత సొసైటీలకు మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని తలపెట్టారు. దీంతో కొత్త వాటికి ఇప్పట్లో ఎన్నికలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు కొత్తగా సొసైటీలు ఇంకా రూపుదిద్దుకోకపోవడం, కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడం, ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో పాటు ఓటర్ల విభజన కాకపోవడంతో జిల్లాలోని పాత 37 సహకార సంఘాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సహకార సంఘాలకు ఆమోద ముద్ర పడకపోవడంతో పాత సొసైటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


రిజర్వేషన్లపై ఉత్కంఠ...

సహకార సంఘాల ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కో సొసైటీలో 13 మంది డైరెక్టర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇందులో 7 ఓసీలకు, 2 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీకి, 1 ఓసీ(మహిళ)కి ఇస్తారు. ఇందులో గెలిచిన వారెవరైనా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికవుతారు. ఇందులో ముందుగా డైరెక్టర్‌ స్థానం కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. వీరంతా రిజర్వేషన్లపై ఉత్కంఠతో ఉన్నారు. జిల్లాలోని 37 సహకార సంఘాలకు సంబంధించిన ఓటరు జాబితాతో పాటు డైరెక్టర్ల రిజర్వేషన్లను సోమవారం ఉదయం ప్రకటించనున్నట్లు సహకార శాఖ అధికారులు వెల్లడించారు. సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారు తాము పోటీ చేసే స్థానాల్లో రిజర్వేషన్‌ అనుకూలంగా వస్తుందా..? రానట్లయితే ఎక్కడ నుంచి పోటీ చేయాలి..? అన్న ఆలోచనలతో పడ్డారు. 


logo