గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Feb 01, 2020 , 23:57:56

నిరాశే మిగిలింది!

నిరాశే మిగిలింది!
  • మెదక్‌కు రైలు కూత వినపడేదెప్పుడో..?
  • కేంద్ర బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు మొండి చేయి
  • మనోహరాబాద్‌, కొత్తపల్లి రైల్వే లైన్‌ నిర్మాణానికి దక్కని నిధులు
  • నిరాశలో మెదక్‌ జిల్లా ప్రజలు..
  • అంకెల గారడీ చేశారంటున్న మేధావులు, విద్యావేత్తలు
  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల కృషితో పనులు ముందుకు...
  • రైల్వేలైన్‌ పూర్తి కోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా దక్కని ఫలితం

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైల్వే బడ్జెట్‌ కేటాయింపులో కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆశపడ్డ మెతుకుసీమవాసులకు నిరాశే దక్కింది ! కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడంతో పనులు చకాచకా సాగి తుది దశకు చేరుకున్నాయి. ఈసారి నిధులు కేటాయిస్తే త్వరలో రైలు కూత వినిపించనున్నదని ఆనందపడ్డ జిల్లావాసులను కేంద్ర ప్రభుత్వం నిరాశకు గురిచేసింది. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంకెల గారడీ చేసిందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టు వ్యయం మొత్తం 1,160 కోట్లు ఉండగా ఇప్పటికి వరకు  కేంద్రం 200కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ.60కోట్లను వెచ్చించింది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల కృషితో పనులు ముందుకు సాగుతుండగా, పనులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదు. 


శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ మెదక్‌ జిల్లా ప్రజలను నిరాశపర్చింది. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి సర్వేల కోసం నిధులను కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందారు. మనోహరాబాద్‌ - కొత్తపల్లి రైల్వే లైన్‌ పనులను నాలుగు విడుతల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.1,160కోట్లు ఉండగా ఇప్పటికి వరకు కేంద్రం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ.60కోట్లు వెచ్చించింది. ఈ పనులు మరింత వేగంగా జరుగాలంటే  కేంద్రప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉండేది. కానీ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల కేటాయింపుల ఊసే లేకుండా పోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. అదేవిధంగా అక్కన్నపేట - మెదక్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి  సంబంధించి 17.2 కి.మీ లైన్‌కు గాను ఇప్పటికి వరకు 15 కి.మీ మేర లైన్‌ పట్టాలను బిగించారు. కొత్తపల్లి - మనోహరాబాద్‌ రైల్వేలైన్‌కు ఈ బడ్జెట్‌లో కొంత మేరకైన నిధులు కేటాయిస్తే రెండోదశ పనులు గజ్వేల్‌ - సిద్దిపేట వరకు రైల్వే లైన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేవి. నిధులు విడుదల చేయాలని ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డితో పాటు, కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లు పలు మార్లు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అయినా కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. రెండు రకాల ఆదాయపు పన్ను విధానంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అంకెల గారడీ చేశారని మేథావులు, విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్త చేశారు.


ప్రజలకు లాభం లేని బడ్జెట్‌..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలకు లాభం లేదు. రెండు రకాల పన్ను విధానంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారు. 2019-20లో రూ.93,848 లక్షల కోట్ల నుంచి 2020-2021లో రూ.99,300 కేటాయింపుతో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉన్నది.

- శ్యాంరావు, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు


వేతన జీవులకు కేంద్ర బడ్జెట్‌ నిరాశ..

కేంద్ర బడ్జెట్‌ 2020-21లో వేతన జీవులకు నిరాశే మిగిల్చింది. రూ.5లక్షల లోపు వ్యక్తిగత ఆదాయం పై పన్ను నుంచి మినహాయింపు. నూతన స్లాబుల మార్పులతో కేంద్ర ప్రభుత్వం రూ.40వేల కోట్లను కోల్పోనున్నది. కొత్త ఆదాయపన్ను పరిమితులు ఇన్సూరెన్స్‌లు, గృహ రుణాలు వంటి మినహాయింపులతో కూడిన 80(సీ) వర్తింపు ఉండదు. దీంతో వేతన జీవులకు కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది. 

- మల్లారెడ్డి, ఉపాధ్యాయుడు


బడ్జెట్‌లో మిషన్‌ భగీరథకు పైసలు లేవు..

కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్‌లో రాష్ర్టానికి రూపాయికి కూడా కేటాయించలేదు. కనీసం భగీరథకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు. ఈ సారైనా బడ్జెట్‌లో నిధులు ఇస్తారంటే ఇప్పుడు కూడా ఇవ్వలేదు. బడ్జెట్‌ నిరాశజనకంగా ఉంది. బడ్జెట్‌లో ఏ మాత్రం కొత్తదనం లేదు.  

- గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు


రెండు రకాల ఆదాయపు పన్ను విధానంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంకెల గారడీ

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రెండు రకాల ఆదాయపు పన్ను విధానంతో వేతన జీవులకు ఊరట లభించలేదు. 2020-21లో విద్యకు నామమాత్రపు కేటాయింపులు చేశారు. రెండు రకాల పన్ను విధానంతో ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. 

- కొండల్‌ రెడ్డి, సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు


logo