శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Feb 01, 2020 , 23:57:16

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌..

సంగారెడ్డి టౌన్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ పథకం అమలు చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)లో కేంద్రప్రభుత్వం వీఆర్‌ఎస్‌ పథకం తీసుకురావడంతో 243 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాల నివారణ పేరుతో వీఆర్‌ఎస్‌ పథకం జనవరి 31న అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 373 మంది ఉద్యోగులు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నారు. వారిలో సగం మందికి పైగా అధికారులు, ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. నష్టాలను నివారిస్తాం.. సంస్థను కాపాడుతాం అంటూ 50 సంవత్సరాలు దాటిన వారు ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తిస్థాయి కాలం వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించడంతో అర్హత ఉన్నవారందరూ దరఖాస్తులు చేసుకున్నారు. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 19 మంది అధికారులు ఉండగా 224 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ స్వచ్ఛంద పదవీ విరమణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ కావడంతో దరఖాస్తులు చేసుకున్న 243 మందికి సంగారెడ్డిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో జనవరి 31న రిలీవ్‌ ఆర్డర్లు అందజేశారు. చాలా మందికి వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం బలవంతంగా అర్హత ఉన్న ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయిన దరఖాస్తులు చేసుకున్నారు. 


243 మందికి వీఆర్‌ఎస్‌ వర్తింపు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 243 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 373 మంది ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ ఒత్తిడి మేరకు 243 మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల కావడంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో 29, 30, 31 తేదీల్లో ఉద్యోగులకు రిలీవ్‌ ఆర్డర్లు అందజేశారు. మిగిలిన 130 మంది ఉద్యోగులు వారి వారి స్థానాల్లోనే పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులు ఇంటిదారి పట్టిన వారి స్థానాల్లో తాత్కాలిక సేవలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఒకేసారి ఉమ్మడి జిల్లాలో 243 మంది వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. అవకాశం ఉన్న అన్ని విభాగాలకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని తీసుకుంటామని, యథావిధిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రీ పెయిడ్‌, పోస్టు పెయిడ్‌, ఇంటర్నెట్‌ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండకుండా చర్యలు తీసుకున్నారు. 


50 సంవత్సరాలు దాటిన వారికి వీఆర్‌ఎస్‌..

కేంద్రప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాలను నివారించి లాభాల భాటలో నడిపిస్తామని, ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, అందులో 50 సంవత్సరాలు దాటిన వారందరికీ స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 50 సంవత్సరాలు దాటిన వారందరూ ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తికాలం వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించింది.



logo