సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Feb 01, 2020 , 00:48:39

అక్షర లక్ష్యం ఈచ్‌వన్‌.. టీచ్‌వన్

అక్షర లక్ష్యం ఈచ్‌వన్‌.. టీచ్‌వన్
  • సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం విజయవంతం కోసం ముమ్మర ఏర్పాట్లు
  • అధికారులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైన కలెక్టర్‌
  • జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలోపూర్తయిన నిరక్షరాస్యుల సర్వే
  • జిల్లాలోని 20 మండలాల్లో 1,20,258 మంది నిరక్షరాస్యులు

మెదక్‌ కలెక్టరేట్‌ :తెలంగాణ రాష్ర్టాన్ని వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు ప్రతినబూనాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ను స్వీకరించాలని ‘ప్రతి ఒక్కరూ.. మరొకరికీ బోధించాలి..’ అనే నినాదం స్ఫూర్తితో ప్రతి విద్యావంతుడు నిరక్షరాస్యుడైన ఇంకొక వ్యక్తిని అక్షరాస్యుడిగా మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని అక్షర ప్రగతిలో కూడా దేశంలోనే అగ్రగామిగా నిలుపడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్రంలో ప్రారంభించనున్నది. జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో ఆయా పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిరక్షరాస్యుల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6,68,515 జనాభా ఉండగా వీరిలో 1,20,258 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. పురుషులు 41,503 ఉండగా.. స్త్రీలు 78,728, ఇతరులు 27 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరందిరిని ఈ సంవత్సరం చివరి నాటికి సంపూర్ణ అక్షరాస్యులుగా మార్చడానికి జిల్లా అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. 


అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమైన  కలెక్టర్‌.. 

ప్రతి ఒక్కరూ ఇంకొకరిని అక్షరాస్యులుగా మార్చాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కలెక్టర్‌ ధర్మారెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులు, మేధావులతో సమావేశమై చర్చించారు. రాష్ట్ర సగటు కంటే జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌.. కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన మేథావుల సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పటిష్టమైన ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఎక్కువగా నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటంతో ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తమ ఇంటి ఇరుగు పొరుగు వారిని అక్షరాస్యులుగా మార్చేలా విద్యాశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో ఈ కార్యక్రమం జిల్లాలో ప్రారంభం కానున్నది. 

అక్షరాస్యత కార్యక్రమం విజయవంతంలో కీలకం కానున్న విద్యార్థులు, 

ఉపాధ్యాయులు.. 

ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌.. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కీలకం కానున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా అక్షరాస్యులుగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ కార్యక్రమం విజయవంతంలో భాగస్వామ్యమయ్యేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈచ్‌వన్‌..  టీచ్‌వన్‌.. కార్యక్రమం విజయవంతం కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo