శనివారం 28 మార్చి 2020
Medak - Feb 01, 2020 , 00:45:57

పల్లెప్రగతిలో అధికారుల పనితీరు భేష్‌

పల్లెప్రగతిలో అధికారుల పనితీరు భేష్‌

మెదక్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత  పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారుల పనితీరు చాలా బాగుందని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా జిల్లాలోని 20 మండలాల ఎంపీడీవోలు, సూపరింటెండెంట్‌లు, సీనియర్‌ అసిస్టెంట్లతో రివ్యూ సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ జిల్లాలోని ఆయా మండలాల్లో జరిగిన పల్లెప్రగతి పనులను ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఇ ప్పటి వరకు గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశారా లేదా అని అడిగారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత మాట్లాడుతూ ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి పల్లెల స్వరూపాన్ని మార్చిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తూ నిధులను విడుదల చేస్తున్నారని గుర్తు చేశారు. మొదటి విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌తో పాటు జిల్లాలోని ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లను అభినందించారు. అదే విధంగా రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం పూర్తి చేసినందుకు అభినందించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రత్యేకంగా కృషి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు.


గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు

కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌

గ్రామపంచాయతీలకు సీఎం కేసీఆర్‌ భారీగా నిధులు కేటాయిస్తున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. పల్లెప్రగతి మొదటి విడుతలో ప్రతి నెలా గ్రామ పంచాయతీకి రూ.2 నుంచి 3 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మేజర్‌ గ్రామపంచాయతీలకు రూ.5 నుంచి 10 లక్షల వరకు నిధులు వచ్చాయని అన్నారు. 

ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లను

పరిచయం చేసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌

30 రోజుల పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎంపీడీవోలు, సూపరింటెండెండ్లను పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మా ట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్‌డీఏ పీడీ సీతారామారావు, డీపీవో హనోక్‌, రా మాయంపేట జెడ్పీటీసీ సంధ్యారాణి, జెడ్పీ సూపరింటెండెంట్‌ జమ్లానాయక్‌, జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo