బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 31, 2020 , 00:32:19

ఇక సహకార సమరం

ఇక సహకార సమరం
  • పీఏసీఎస్‌ ఎన్నికలకు పచ్చజెండా
  • ఫిబ్రవరి 6 నుంచి 8వరకు నామినేషన్ల స్వీకరణ
  • 9న పరిశీలన, 10న ఉపసంహరణ
  • 15న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు
  • జిల్లాలో 37 ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలు
  • సుమారు 38 వేల మంది ఓటర్లు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది .   ఫిబ్రవరి 3న జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదే నెల 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉంటుంది. 15న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.  కాగా జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 37 ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలున్నాయి. వీటిలో సుమారు 38 వేల మంది ఓటర్లున్నారు. 2013 జనవరిలో ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరుగగా, రెండేండ్ల కిందట పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వరుసగా శాసనసభ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో ప్రస్తుత పాలకవర్గాన్ని పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగిస్తూ ప్రతి ఆరు నెలలకొకసారి పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తుంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగియగానే సహకార ఎన్నికలు రావడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది.  


ఎన్నికల ప్రక్రియ ఇలా.. 

నోటిఫికేషన్‌ : ఫిబ్రవరి 3న

నామినేషన్ల స్వీకరణ : ఫిబ్రవరి 6,7, 8  

నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 9న నామినేషన్ల 

ఉపసంహరణ : ఫిబ్రవరి 10న

పోలింగ్‌ : ఫిబ్రవరి 15న ఉదయం 7 నుంచి 2గంటల వరకు

కౌంటింగ్ ‌: అదేరోజు 15న మధ్యాహ్నం 3 గంటల నుంచి

ఫలితాలు : కౌంటింగ్‌ అనంతరం

ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక : అదేనెల 16న


రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఎన్నికల కోలాహలం ఇంకా ఆగలేదు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో ఎన్నికల సమరానికి శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌. గడువు ముగిసినా ఇన్‌చార్జీలతో పాలన సాగిస్తున్న వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాయత్తమయ్యారు. సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి అధికారులు సన్నద్ధం కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  


గ్రామాల్లో సహకార ఎన్నికల సమరం...

గడువు ముగిసినా కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి సహకార ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఇక గ్రామాల్లో సహకార ఎన్నికల కోలాహలం మొదలుకానున్నది. సహకార సంఘాల పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. అయినా ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. వాటి కాలం కూడా ఫిబ్రవరి నాలుగో తేదీన ముగియనున్నది. ఇప్పటి వరకు ఉన్న వారి పదవీ కాలం గడువు పూర్తి కావడం, నూతనంగా మరికొన్ని సంఘాలు ఏర్పాటు చేయడంతో ఆశావహులకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నాయకులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో సహకార సంఘాల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉన్నది.


సమరానికి సన్నద్ధం..

జిల్లాలోని అన్ని సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు పొడిగించారు. ఇప్పుడు నాలుగో సారి పొడిగించకుండా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. జిల్లాలో గతంలో ఎన్నికలు నిర్వహించి సంఘానికి 13 మంది చొప్పున పాలక మండలిని ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. గతంలో పలుమార్లు ఓటర్ల జాబితాను రూపొందించారు. వాటిపై అభ్యంతరాలు కూడా తీసుకోవడం పూర్తి చేశారు. వరుసగా శాసన సభ, పంచాయతీలు, మండలం, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, తర్వాత లోక్‌సభ ఎన్నికలు, తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడంతో తప్పని పరిస్థితుల్లో సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. 


జిల్లాలో కొత్తగా 15 సంఘాలు...

రైతు సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు సహకార సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో ప్రస్తుతం 37 సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 15 సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నది.  మండలాల వారీగా సభ్యులు, గ్రామాల పరిధి తదితర వాటిని బట్టి సంఘాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేసి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిపై అభ్యంతరాలకు 21 రోజులు గడువు ఇచ్చారు. జిల్లాల విభజనకు ముందు అవసరాన్ని బట్టి ఒక్కో మండలంలో మూడు, నాలుగు సంఘాలు ఏర్పాటు చేసుకోగా, కొన్ని మండలాల్లో అసలు సంఘాలే లేవు. జిల్లాలు విభజించిన తర్వాత సంఘాల విభజన జరిగింది. వీటితో పాటు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. మండలాల వారీగా జిల్లాలో ప్రస్తుతం 37 సంఘాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో రెండేసి సంఘాలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని మండలాల్లో అదనంగా సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా మొత్తంలో గతంలో ఉన్న సంఘాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి 52 సంఘాలు ఏర్పాటు కానున్నాయి.  


జిల్లాలో 37 సంఘాలకే ఎన్నికలు...

జిల్లాలో గతంలో ఉన్న 37 సహకార సంఘాలకే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాలకు ప్రస్తుతం సుమారు 38 వేల మంది సభ్యులు ఉన్నారు. అయితే నూతనంగా ఏర్పడిన 15 సంఘాలకు ఎన్నికలు జరుపడం లేదు. 


నోటిఫికేషన్‌ విడుదల...

జిల్లాలో 37 సహకార సంఘాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఉంటుందని ఇన్‌చార్జి డీసీవో ప్రసాద్‌ తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 16వ తేదీన ఆఫీస్‌ బేరర్‌ ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు.


త్వరలోనే మార్గదర్శకాలు..

జిల్లాలోని సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగియనున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో దాని ప్రకారంగా ఓటర్ల జాబితా, సభ్యత్వం తదితర వాటిని పూర్తి చేశాం, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించారు. తాజాగా గడువు ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం, ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. 

- ప్రసాద్‌, ఇన్‌చార్జి డీసీవో


logo