గురువారం 09 ఏప్రిల్ 2020
Medak - Jan 31, 2020 , 00:03:32

కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర

కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర

నర్సాపూర్‌ రూరల్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార  సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జేసీ నగేశ్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని వెల్లడించారు. రైతులు దళారీలను నమ్మి మోసపోవద్దన్నారు. కందులకు  ప్రభుత్వం మద్దతు ధరను అందజేస్తుందని తెలిపారు. క్వింటాల్‌ కందులకు రూ.5800 ధర చెల్లిస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 


రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో వేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ ఏడీఎం రమ్య, మార్క్‌ఫెడ్‌ డీఎం నర్సింహారావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శారద, ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ మాలతి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నగేశ్‌, అధికారులు పాల్గొన్నారు. 


logo