బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 29, 2020 , 23:21:28

అన్నదాతకు మరింత సహకారం

అన్నదాతకు మరింత సహకారం
  • - ఇప్పటికే జిల్లాలో 37 సహకార సంఘాలు
  • - నూతనంగా 15 సహకార సంఘాలకు నోటిఫికేషన్‌
  • - ఫిబ్రవరి 9వ తేదీ లోపు అభ్యంతరాల స్వీకరణ
  • - ఈ నెల 31తో ముగియనున్న సహకార సంఘాల పదవీకాలం
  • - మరో ఆరు నెలలు పొడిగింపుకు ప్రతిపాదనలు

మెదక్‌, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల నుంచి అన్నదాతలకు మరిన్ని సేవలు అందనున్నాయి. ప్రతి మండలానికి రెండు సహకార సంఘాలు విధిగా ఉండాలనే నిబంధనలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 20 మండలాలకు గాను ప్రస్తుతం 37 సహకార సంఘాలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో రెండు సహకార సంఘాలు ఉండగా, మరికొన్ని మండలాల్లో ఒక్కొక్కటి మాత్రమే పనిచేస్తున్నది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన  మండలాల్లో అసలు సహకార సంఘాలు లేవు. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి రెండు సంఘాలు ఉండాలంటే గతంలో ఉన్న 37 సంఘాలకు అదనంగా మరో 15 సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో సహకార సంఘాల సంఖ్య 52కు చేరింది.


జనవరి 20నే నోటిఫికేషన్‌ విడుదల..

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా సహకార శాఖ జనవరి 20వ తేదీనే జారీ అయింది. గతంలో ఉన్న సహకార సంఘాలు, మండలానికి రెండు చొప్పున కొత్తగా ఏర్పాటు కానున్న సంఘాల వివరాలతో పాటు వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలతో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇదిలావుండగా నోటిఫికేషన్‌ పత్రాలను ఆయా ప్రాథమిక సహకార సంఘాలు, అన్ని మండలాల కార్యాలయాలు, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా గ్రామాల రైతులు, సహకార సంఘాల సభ్యులు ఫిబ్రవరి 9వ తేదీలోపు ఆయా సంఘాల్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు. వచ్చిన అభ్యంతరాలను జిల్లా సహకార శాఖ పరిశీలించి సరిచేసిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నది.


సహకార సేవలు రైతులకు మరింత చేరువ..

కొత్తగా సహకార సంఘాల ఏర్పాటుతో ఈ సేవలు రైతులకు మరింత చేరువకానున్నాయి. అంతేకాకుండా సహకార సంఘాల్లో కొత్తగా సభ్యులను సైతం చేర్చుకునే అవకాశం ఉంటుంది. మండలానికి రెండు ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటుతో సేవలు విస్తరించనున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే సహకార సంఘాల ద్వారా రైతులకు పంటరుణాలతో పాటు ఇతర అవసరాలకు రుణాలు అందజేస్తున్నారు. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయం వంటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా సహకార సంఘాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రైతులకు సేవలందించడం లేదనే ఉద్దేశంతో మండలానికి రెండు ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు.


సహకార సంఘాల పదవీ కాలం పొడిగింపునకు ప్రతిపాదనలు...

జిల్లాలో ప్రస్తుతం ఉన్న 37 సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్నది. గతంలో మూడు సార్లు సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా మరో 15 సహకార సంఘాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. ఇదిలావుండగా సహకార సంఘాల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలంటూ జిల్లా సహకార శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తే జూన్‌ లేదా జూలై నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.


జిల్లాలో కొత్తగా 15 సహకార సంఘాలు..

జిల్లాలో 20 మండలాలకు గాను గతంలో 37 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా 15 సంఘాల ఏర్పాటుకు జిల్లా సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే మనోహరాబాద్‌, హవేళిఘనపూర్‌ మండలాల్లో సహకార సంఘాలు లేనందున అక్కడ రెండేసి చొప్పున సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 


రైతులకు మేలు జరుగుతుంది..

ప్రభుత్వ ఆదేశాలతో నూతనంగా జిల్లాలో 15 సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. సహకార సంఘాల వ్యవస్థ, సహకార సంఘాల బలోపేతంతో రైతులకు మేలు జరుగుతుంది.  ప్రతి మండలానికి రెండు సహకార సంఘాల ఏర్పాటు చేయడంతో కొత్తగా మరో 15 సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండలానికి రెండు సహకార సంఘాలు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేశాం. సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు, రుణాలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. అన్నదాతలకు అందించే సేవలు మరింత చేరువ కానున్నాయి.

- టి.ప్రసాద్‌, ఇన్‌చార్జి జిల్లా సహకార అధికారి


logo