బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 29, 2020 , 03:03:44

నయా జోష్‌

నయా జోష్‌
  • - మున్సిపల్‌ పోరులో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం
  • - జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ అఖండ విజయం
  • - చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక
  • - టీఆర్‌ఎస్‌ పథకాలు, కేటీఆర్‌ కార్యదీక్షతకు ప్రజలు పట్టం
  • - ఫలించిన ప్రజాప్రతినిధుల వ్యూహాలు
  • - సంబురాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

మెదక్‌, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురేలేదని జిల్లా ప్రజలు నిరూపిస్తున్నారు. తాజాగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగు పురపాలికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. తాజా పరిణామాలతో ఇప్పటికే నామమాత్రంగా ఉన్న విపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.  అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి స్పష్టమైన తీర్పునిచ్చి  ఉద్యమ పార్టీకే అండగా ఉంటామని నిరూపించారు.  అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా ఇంటింటికీ వెళ్లాలన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచనలతో, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఇతర ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కారణంగా అన్ని మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. తాజా విజయంతో జిల్లా వ్యాప్తంగా  గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.


అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.  రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ విజయదుందుభి మోగిస్తూనే ఉన్నది. అది కూడా ప్రత్యర్థి పార్టీలకు కలలో కూడా సాధ్యం కాని మెజార్టీతో అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలో ఒక్కటి మినహా అన్ని స్థానాలను దక్కించుకున్నది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఎంపీలను గెలిపించుకున్నది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ రికార్డులను తిరగరాస్తూ 93 శాతం స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకున్నది. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించుకొని సీఎం కేసీఆర్‌ పాలన మీద, మంత్రి కేటీఆర్‌ కార్యదక్షత మీద తమకున్న నమ్మకాన్ని చాటారు.


కారు జోరు ముందు నిలువలేక పోయిన ప్రత్యర్థులు...

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు జోరు చూపించింది. ఈ ఎన్నికలను తన పనితీరును కొలమానంగా తీసుకుంటానని ప్రకటించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ప్రజలు వందకు వందశాతం మార్కులు వేశారు. దీనికితోడు సీఎం కేసీఆర్‌ పాలనపై తమకు ఉన్న విశ్వాసాన్ని ప్రజలు మరోసారి ఓట్ల రూపంలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీలలో అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే నాలుగు మున్సిపాలిటీల పీఠాలపై అధికార పార్టీకి చెందిన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఎన్నికయ్యారు. 


ప్రజలను మెప్పించిన సీఎం కేసీఆర్‌ పాలన, పథకాలు...

సీఎంగా కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఈ ఎన్నికలతో మరోసారి స్పష్టమైందనే చెప్పాలి. సీఎం కేసీఆర్‌ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాల మాటలను ఏమాత్రం  నమ్మని ఓటర్లు కారు గుర్తు అభ్యర్థులను గెలిపించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఒక్కో ఓటుకు వేల రూపాయలు వెచ్చించినా ప్రజలు సీఎం కేసీఆర్‌ పథకాల నుంచి పొందుతున్న లబ్ధికే తమ ఓటని బ్యాలెట్‌తో  విపక్షాలకు సమాధానం చెప్పారు. కేసీఆర్‌ ఆడపిల్లలకు పెద్దన్నలాగా ఉంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు ఆర్థిక సాయం అందిస్తూ పెండ్లిళ్లకు సాయం చేయడం, ఎవరి సాయం లేని దివ్యాంగులకు అన్నీ తానై అందిస్తున్న పింఛన్లు, కుటుంబంలో తానే పెద్ద కొడుకై అందిస్తున్న వృద్ధాప్య పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాల నుంచి లబ్ధిపొందుతున్న ప్రతి ఒక్కరూ మరో ఆలోచన లేకుండా కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారం కట్టబెట్టారు. మొత్తానికి అధికార పార్టీతోనే తమ కాలనీలు, వార్డులు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయన్న నమ్మకాన్ని ఉంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు.


logo