ఆదివారం 29 మార్చి 2020
Medak - Jan 29, 2020 , 03:00:52

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజల సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయం

పెద్దశంకరంపేట : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు.  మంగళవారం మండల కేంద్రం పెద్దశంకరంపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ గతంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ఏటా లక్షలాది రూపాయల విలువైన ఆస్తులు బుగ్గిపాలయ్యాయన్నారు.   తెలంగాణ ప్రభుత్వం ఫైర్‌స్టేషన్‌ను మంజూరు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే జోగిపేట, నారాయణఖేడ్‌ నుంచి అగ్నిమాపక సిబ్బంది రావాల్సి వచ్చేదని, సకాలంలో చేరుకోకపోవడంతో ఆస్తులు దగ్ధమైపోయేవన్నారు. పేట మండలంలో అగ్నిమాపక కేంద్రం ఉంటే అగ్నిప్రమాదాలను నివారించే అవకాశం ఉందని స్థానికులు తెలుపడంతో ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి  ఫైర్‌స్టేషన్‌ను మంజూరు చేయించామన్నారు. పెద్దశంకరంపేట మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల టేక్మాల్‌, అల్లాదుర్గం, రేగోడ్‌, పెద్దశంకరంపేట, పాపన్నపేట మండలాలకు కూడా మేలు కలుగనున్నదన్నారు. పేట అగ్ని మాపక కేంద్రంలో అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. త్వరలో రూ.5 లక్షలతో షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. 


పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలుపుతాం..

పెద్దశంకరంపేట మండలాన్ని త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేటలో అన్ని సబ్‌డివిజన్‌ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు చేపడుతామన్నారు. త్వరలోనే పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డి జిల్లాలో విలీనమవుతుందన్నారు. ఇక్కడ కూడా జిల్లా మారిన తర్వాత పేట మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తూ అన్ని సబ్‌డివిజన్‌ ఆఫీసులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, మెదక్‌ జిల్లా పైర్‌ ఆఫీసర్‌ గౌతం, పేట మండల ఫైర్‌ ఆఫీసర్‌ రాఘవరెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జెడ్పీటీసీ విజయరామరాజు, వైస్‌ ఎంపీపీ లక్ష్మీరమేశ్‌, ఎంపీటీసీలు వీణాసుభాశ్‌గౌడ్‌, దత్తు, రాజమణి లక్ష్మీనారాయణ, దామోదర్‌, స్వప్న రాజేశ్వర్‌, ఉప సర్పంచ్‌ దశరథ్‌, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు, సర్పంచులు ప్రకాశ్‌, అంజిరెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, ఎంపీడీవో బన్సీలాల్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo