గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 29, 2020 , 02:56:59

పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

వెల్దుర్తి : గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులు సక్రమంగా చేయకపోవడంపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రం వెల్దుర్తిలోని ఎస్సీ కాలనీ, మండలంలోని చర్లపల్లి, ఉప్పులింగాపూర్‌ గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌తో కలిసి కలెక్టర్‌ ఆకస్మికంగా పర్యటించారు. వెల్దుర్తి, ఉప్పులింగాపూర్‌ గ్రామాల్లో మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, రోడ్ల పక్కన, మురికి కాలువల్లో పడేయడం, వీధులు అపరిశుభ్రంగా ఉండటంపై ఎంపీడీవో జగదీశ్వరాచారి, మండల పంచాయతీ అధికారి తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పద్మ, హరికృష్ణలపై తీవ్రంగా మండిపడ్డారు. గత సెప్టెంబర్‌లో 30 రోజుల పల్లెప్రగతి ప్రణాళిక, ఈ నెలలో 10 రోజుల రెండో విడుత పల్లెప్రగతిలో గ్రామాల్లో ఏం పనులు చేశారని, విధుల్లో ఇంత నిర్లక్ష్యమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చాల్సిన అధికారులు, వాటిని పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. 


పల్లెప్రగతి పనుల్లో ఈజీఎస్‌ కూలీలు రావడం లేదని, కూలీలను పంపించాలని ఈజీఎస్‌ అధికారులను అడిగితే, కూలీల డబ్బులు రావడం లేదని సమాధానం ఇస్తున్నారని వెల్దుర్తి సర్పంచ్‌ భాగ్యమ్మ కలెక్టర్‌కు తెలుపగా, స్పందించిన కలెక్టర్‌ పల్లెప్రగతి పనుల బిల్లులు పది, పదిహేను రోజుల్లో చెల్లిస్తున్నామని, మీరు బిల్లులు పంపించకుండా ఏం చేస్తున్నారని ఏపీవో రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, సర్పంచులు అశోక్‌రెడ్డి, భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, నాయకులు ఆంజనేయులు, భూపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పెంటారెడ్డి, మహిపాల్‌రెడ్డి, చందు, మైసయ్య, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo