శనివారం 28 మార్చి 2020
Medak - Jan 28, 2020 , 02:45:18

గులాబీ పట్నాలు

గులాబీ పట్నాలు
  • - ఎక్స్‌అఫీషియో మెంబర్లుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి
  • - మెదక్‌లో చైర్మన్‌గా చంద్రపాల్‌ను, వైస్‌చైర్మన్‌గా మల్లికార్జున్‌గౌడ్‌ ఎన్నిక
  • - నర్సాపూర్‌లో చైర్మన్‌గా మురళీయాదవ్‌, వైస్‌చైర్మన్‌గా నయీమొద్దీన్‌
  • - తూప్రాన్‌లో రాఘవేందర్‌గౌడ్‌, నందాల శ్రీనివాస్‌
  • - రామాయంపేటలో పల్లె జితెందర్‌గౌడ్‌ , పుట్టి విజయలక్ష్మీల ఎన్నిక
  • - జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు
  • - స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌వైపే...
  • - చైర్మన్ల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సోమవారం చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాలలో మొదట కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. అన్నిమున్సిపాలిటీల్లోనూ స్పష్టమైన మెజార్టీ ఉండటంతో   టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే అయ్యింది. ఎక్స్‌ అఫీషియో మెంబర్లుగా మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. అన్నిమున్సిపాలిటీల్లోనూ స్వతంత్ర  అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపారు.  మెదక్‌లో  తొడుపునూరి చంద్రపాల్‌ను చైర్మన్‌గా, ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌ను వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోగా, రామాయంపేటలో  పల్లె జితెందర్‌గౌడ్‌ను చైర్మన్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌గా పుట్టి విజయలక్ష్మిని  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  తూప్రాన్‌ మున్సిపాలిటీలో బొంది రాఘవేందర్‌గౌడ్‌ చైర్మన్‌గా, నందాల శ్రీనివాస్‌ వైస్‌ చైర్మన్‌గా  ఎన్నికవ్వగా, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో  చైర్మన్‌గా ఎర్రగొల్ల మురళీయాదవ్‌, వైస్‌ చైర్మన్‌గా నయీమొద్దీన్‌ ఎన్నికయ్యారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో పలుచోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 


మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పట్టణానికి చెందిన తొడుపునూరి చంద్రపాల్‌ ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిల్‌ సభ్యులతో ఆథరైజ్డ్‌ అధికారి సీతారామారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి సీతారామారావు ముందుగా కొత్తగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అధికారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆథరైజ్డ్‌ అధికారి మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా తొడుపునూరి చంద్రపాల్‌ను, వైస్‌ చైర్మన్‌గా ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌ను నియమిస్తూ బీ ఫాం అందజేయడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 12వ వార్డు కౌన్సిలర్‌ తొడుపునూరి చంద్రపాల్‌ను చైర్మన్‌ అభ్యర్థిగా 30వ వార్డు కౌన్సిలర్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌ ప్రతిపాదించగా 13వ వార్డు కౌన్సిలర్‌ వెంకట్‌రెడ్డిగారి సులోచన బలపరిచారు. అనంతరం ఇతరులు ఎవరైనా చైర్మన్‌ అభ్యర్థిగా నిలబడేందుకు ఆసక్తి ఉన్న వారు తెలియజేయాలని కోరారు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా 9వ వార్డు కౌన్సిలర్‌ మేడి కల్యాణిని 5వ వార్డు కౌన్సిలర్‌ మామిండ్ల ఆంజనేయులు ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్‌ ముస్లాపురం రాజలింగం బలపర్చడం జరిగింది. 


అనంతరం ఇద్దరు చైర్మన్‌ అభ్యర్థులకు గాను చైర్మన్‌ ఎన్నికను నిర్వహించగా తొడుపునూరి చంద్రపాల్‌కు 24 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తగా, మేడి కల్యాణికి 9 మంది కౌన్సిలర్లు మాత్రమే చేతులు ఎత్తారు. టీఆర్‌ఎస్‌ నుంచి 24 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తడంతో తొడుపునూరి చంద్రపాల్‌ను చైర్మన్‌గా ప్రకటించడం జరిగింది. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ నుంచి 30వ వార్డుకు చెందిన ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌ అభ్యర్థిత్వాన్ని 12వ వార్డుకు చెందిన తొడుపునూరి చంద్రపాల్‌ ప్రతిపాదించగా 3వ వార్డు కౌన్సిలర్‌ కొట్టాల విశ్వం బలపర్చడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా 17వ వార్డు కౌన్సిలర్‌ ముస్లాపురం రాజలింగం పేరును, 5వ వార్డు కౌన్సిలర్‌ మామిండ్ల ఆంజనేయులు ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్‌ మేడి కల్యాణి బలపరిచారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌కు 24 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తగా, ముస్లాపురం రాజలింగంకు 9 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. టీఆర్‌ఎస్‌ నుంచి 24 మంది కౌన్సిలర్లు ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌కు చేతులు ఎత్తడంతో వైస్‌ చైర్మన్‌గా అధికారులు ప్రకటించారు. అనంతరం ఎన్నిక ఆథరైజ్డ్‌ అధికారి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశంలో భాగం గా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో చేతెత్తారు. కార్యక్రమంలో సహాయ ఆథరైజ్డ్‌ అధికారులు రాజిరెడ్డి, జెమ్లా, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


మున్సిపల్‌ చైర్మన్‌కు.. ఎంపీ అభినందన  

నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన మురళీయాదవ్‌ను సోమవారం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌  నర్సాపూర్‌ పట్టణంలోని మురళీయాదవ్‌ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. నర్సాపూర్‌ తొలి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైనందునా  పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. 


రామాయంపేట మున్సిపాలిటీ.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవ ఎన్నిక

రామాయంపేట : రామాయంపేట పురపాలిక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ రెండు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సోమవారం పట్టణ మున్సిపల్‌ కార్యాలయంలో మెదక్‌ ఆర్డీవో, రామాయంపేట మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సాయిరాం ముందుగా పురపాలికలోని 12 మంది సభ్యులను అందరిని ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్‌ఎస్‌ నుంచి 8 మంది సభ్యులు పల్లె జితెందర్‌గౌడ్‌, పుట్టి విజయలక్ష్మి, దేమె యాదగిరి, సరాఫ్‌ సౌభాగ్య, దేవుని జయ, మల్యాల కవిత, చంద్రపు శోభ, గజవాడ నాగరాజు కాగా కాంగ్రెస్‌కి చెందిన చింతల రాధ భవానీ, బొర్ర అనీల్‌, బీజేపీకి చెందిన సుందర్‌సింగ్‌, ఇండిపెండెంట్‌ చిలుక గంగాధర్‌లు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆర్డీవో సమక్షంలో ప్రశాంతంగా చైర్మన్‌ ఎన్నికను చేపట్టారు. ముందుగా చైర్మన్‌ అభ్యర్థి పల్లె జితెందర్‌గౌడ్‌కు పుట్టి విజయలక్ష్మి ప్రతిపాదించగా మరో కౌన్సిల్‌ సభ్యుడు దేమె యాదగిరి బలపర్చారు. వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మికి సభ్యులు పల్లె జితెందర్‌గౌడ్‌ ప్రతిపాదించగా గజవాడ నాగ రాజు బలపర్చారు. 


దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా సభ్యులందరి మద్దతుతో లాంచనంగా ఎన్నిక కాబడింది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విప్‌ జారీతో ఏకగ్రీవమైనట్లు ప్రత్యేకాధికారి సాయిరాం తెలిపారు. రామాయంపేట పోలీసులు సీఐ, నాగార్జునగౌడ్‌ తమ సిబ్బందితో ఎప్పటికప్పుడూ ఎలాంటి సమస్యలు  రాకుండా బందోబస్తును చేపట్టారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో తూప్రాన్‌ డీఎస్పీ. కిరణ్‌ కుమార్‌ రామాయంపేట మున్సిపల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చైర్మన్‌ ఎన్నిక అనంతరం ప్రత్యేకాధికారి సమక్షంలో సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సన్మానించారు.


మంచి పాలన అందించండి..: ఆర్డీవో సాయిరాం

రామాయంపేట మున్సిపల్‌లో అంతా యువకులే విజయం సాధించారు. మీపై నమ్మకం పెంచుకుని మీ విజయానికి కారకులైన పట్టణ ప్రజలను సమస్యలు లేకుండా కాపాడుకోవాలన్నారు. సమస్యలకు వెంటవెంటనే పరిష్కారం చూపి రామాయంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. రామాయంపేట అభివృద్ధి బాధ్యత మీదేనని అన్నారు.


మనందరిదీ ఒకే కుటుంబం..: చైర్మన్‌ పల్లె జితెందర్‌గౌడ్‌

మనమంతా ఒకే కుటుంబంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేద్దామని రామాయంపేట మున్సిపల చైర్మన్‌ పల్లె జితెందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం నూతన మున్సిపాలిటీలో మొట్టమొదటి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. సభ్యులందరూ సహకరిస్తే రామాయంపేటను సమస్యలు లేని రామాయంపేటగా తీర్చిదిద్దుతామన్నారు.


విజయపథంలో నడిపిద్దాం..: వైస్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

రామాయంపేట పట్టణాన్ని విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత మనపైనే ఉందని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో రామాయంపేటను అభివృద్ధి చేద్దామన్నారు. 


కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాయిరాంతో పాటు కమిషనర్‌ రమేశ్‌, అబ్జర్వర్లు రాంమోహన్‌, రమేశ్‌బాబు శర్మ, నవాత్‌ ప్రసాద్‌, కాలేరు ప్రసాద్‌, శంకర్‌, పోచయ్య, బల్ల శ్రీనివాస్‌, ప్రభావతితో పాటు తదితరులు ఉన్నారు.


తూప్రాన్‌లో  రాఘవేందర్‌గౌడ్‌, నందాల శ్రీనివాస్‌  

తూప్రాన్‌ రూరల్‌ : నూతనంగా ఏర్పడిన తూప్రాన్‌ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. తూప్రాన్‌ మున్సిపాలిటీలో ఈ నెల 22న 16వార్డలకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాలు కైవసం చేసుకోగా, సోమవారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల ఎంపికలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఇద్దరూ 5వ వార్డు కౌన్సిలర్‌ చెలిమెల ప్రియాంక, 3వ వార్డు కౌన్సిలర్‌ ఏర్పుల ఉమ టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు.  దీంతో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల ఎంపికలో గెలుపు ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన కౌన్సిలర్లతో ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి జారీ చేసిన విప్‌, ఎన్నికల విధానంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ముందే చదివి కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. 


టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్‌ ఓపెన్‌ చేసి తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి 1వ వార్డుకు చెందిన బొంది రాఘవేందర్‌గౌడ్‌ పేరును 5వ వార్డు కౌన్సిలర్‌ చెలిమెల ప్రియాంక (ఇండిపెండెంట్‌) ప్రతిపాధించగా, 11వ వార్డు కౌన్సిలర్‌ బొంది అరుణ వెంకట్‌గౌడ్‌ బలపరిచారు. సమావేశంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన కౌన్సిలర్లు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొజియొద్ద్దీన్‌ లు ప్రకటించారు. వైస్‌ వైస్‌ చైర్మన్‌గా 13వ వార్డు కౌన్సిలర్‌ నందాల శ్రీనివాస్‌ పేరును 4వ వార్డు కౌన్సిలర్‌ మామిండ్లజ్యోతికృష్ణ ప్రతిపాధించగా, 2వ వార్డు కౌన్సిలర్‌ మామిడి వెంకటేశ్‌లు బలపరిచారు. ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం, ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో వైస్‌ చైర్మన్‌గా నందాల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌లు ప్రకటించారు.


నర్సాపూర్‌లో చైర్మన్‌గా మురళీయాదవ్‌

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఉత్కంఠ నడుమ సాగాయి. ఎన్నికల అధికారులు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌, నర్సాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లి ప్రైవేట్‌ వాహనంలో నేరుగా చాకరిమెట్ల హనుమాన్‌ దేవాలయంలో పూజలు చేసి నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయానికి 10ః30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు వచ్చారు. అనంతరం వాళ్లకు కేటాయించిన సీట్లలో పార్టీల వారీగా కూర్చున్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. 


గెలుపొందిన వారు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం..

నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో 15 వార్డుల్లో  గెలుపొందిన 8 మంది టీఆర్‌ఎస్‌, నలుగురు బీజేపీ, ముగ్గురు ఇండిపెండెంట్లు హాజరయ్యారు. పూర్తి స్థాయి కౌన్సిలర్లు హాజరుకావడంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌ పేర్ల వారీగా పిలిచి కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులందరూ కౌన్సిలర్లుగా సంతకాలు చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను 12ః30 గంటలకు ఎన్నుకుంటామని ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ సభ్యులతో పాటు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గంటన్నర పాటు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఉండిపోయారు. 


మున్సిపల్‌ చైర్మన్‌గా మురళీయాదవ్‌..  వైస్‌ చైర్మన్‌గా నహీమొద్దీన్‌ 

అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఎలాంటి పోటీ లేకపోవడంతో ఎకగ్రీంగా సాగాయి. ఎన్నికల్లో మెజార్టీ సభ్యులను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ తరఫున బీ ఫారం అందచేసిన మురళీయాదవ్‌ను టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా జేసీ నగేశ్‌ ప్రకటించి బలం నిరుపించుకోవాలని సూచించారు. దాంతో 6వ వార్డు కౌన్సిలర్‌ నహిమొద్దీన్‌ మురళీయాదవ్‌ను చైర్మన్‌గా  ప్రతిపాదించగా 1వ వార్డు కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. 


అనంతరం 5 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎరుకల యాదగిరి, గొల్ల రుక్కమ్మ, ఇస్రత్‌ సిద్దిఖా, తంగెడుపల్లి సరితా, పంబళ్ల లలితలతో పాటు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు పంబళ్ల రాంచందర్‌, చెల్మేటి లక్ష్మి, ఎర్రగొల్ల లతలు మద్దతు పలుకడంతో మురళీయాదవ్‌ను నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా జేసీ ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ నుంచి బీ ఫారం అందచేసిన నహీమొద్దీన్‌ను వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ నుంచి వంటెద్దుల సునీతను వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నహీమొద్దీన్‌కు ఎరుకల యాదగిరి ప్రతిపాదించగా, మురళీయాదవ్‌ మద్దతు పలికారు. అయితే బీజేపీ అభ్యర్థి సునీతకు 11వ వార్డు కౌన్సిలర్‌ రాజేందర్‌ ప్రతిపాదించగా 10వ వార్డు కౌన్సిలర్‌ బుచ్చేశ్‌యాదవ్‌ మద్దతు పలికారు. అయితే సునీతకు పూర్తి కోరం లేకపోవడంతో పా టు ఇతరులు ఎవ్వరు మద్దతు పలుకలేదు. టీఆర్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థి  నహీమొద్దీన్‌కు 8 మం ది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ముగ్గురు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మద్దతు పలుకడంతో నహీమొద్దీన్‌ను వైస్‌చైర్మన్‌గా జేసీ నగేశ్‌ ప్రకటించారు. అనంతరం చైర్మన్‌ మురళీయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ నహీమొద్దీన్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, జేసీ నగేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణమూర్తి, మున్సిపల్‌ సిబ్బంది పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.  


logo