సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 26, 2020 , 00:28:01

కారుకే జయహో

కారుకే జయహో


మెదక్‌ ప్రతినిధి నమస్తేతెలంగాణ : మెదక్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబరిచి గులాబీ పార్టీ విజయదుందిబీ మోగించింది. ఈ నెల 22న జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే భారీ భద్రత నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కౌంటింగ్‌ జరిగింది. కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిపి ఫలితాలను వెల్లడించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడింది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు పట్టణ ప్రజలు సైతం ఆదరించారు. మొట్టమొదటి సారిగా మున్సిపాలిటీలుగా ఏర్పడిన రామాయంపేట, నర్సాపూర్‌, తూప్రాన్‌లలో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. జిల్లా మొత్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులకు రెండు ఏకగ్రీవాలు కలుపుకుని 45 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయ దుందిబి మోగించారు. 13 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా 9 మంది బీజేపీ, మెదక్‌లో 1 ఎంఐఎం, 7 మంది టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు గెలుపొందారు. మెదక్‌ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులకు గాను 18 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 9 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, 3 మంది బీజేపీ అభ్యర్థులు, 1 టీఆర్‌ఎస్‌ రెబల్‌ (స్వతంత్ర అభ్యర్థి), 1 ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ చైర్మన్‌ స్థానం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది.

                                                                                                                               

                                                                                                                               నర్సాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరుగగా 8 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, బీజేపీ 4 మంది అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ స్పష్టమైన మెజార్టీ టీఆర్‌ఎస్‌కు లభించింది. ఇక్కడ గెలుపొందిన ముగ్గురు కూడా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులే కావడం గమనార్హం. తూప్రాన్‌ మున్సిపాలిటీ 15 వార్డులకు గాను 11 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు, 2 స్వతంత్ర అభ్యర్థులు, 1 బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ స్పష్టంగా అభివృద్ధి సంక్షేమ పథకాలకే తూప్రాన్‌ ప్రజలు పట్టంకట్టారు. రామాయంపేటలో మొత్తం 12 వార్డులకు గాను 8 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు, 1 బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత టీఆర్‌ఎస్‌కి లభించింది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రాజకీయ చతురత, మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచార వ్యూహం, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డిల కృషితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. మంత్రి కేటీఆర్‌ పలు మార్లు ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమీక్షలు నిర్వహించి సక్సెస్‌ చేశారు. జిల్లా మొత్తంగా నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరువలేదు. ఒక్క వార్డు సైతం గెలువలేదు.

                                                                                                                           

                                                                                                                                         logo