బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 26, 2020 , 00:26:14

గులాబీ రెపరెపలు

గులాబీ రెపరెపలు


సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ మరోసారి తన సత్తా చాటుకున్నది. ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించి అన్ని స్థానాలను కైవసం చేసుకున్నది. పల్లెతో పాటు పట్టణ ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నట్లు ఈ ఎన్నికలతో రుజువైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 15 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం విశేషం. 10 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రాగా, 4 చోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులతో, ఎక్సఫీషియో ఓటుతో మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనున్నది. ఉమ్మడి జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో మొత్తం 309 వార్డులకు గానూ 173 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 35 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా, అందులో మెజార్టీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ కావడం గమనార్హం. మొత్తంగా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. గెలుపొందిన టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ముఖ్యనేతల వద్దకు తరలివెళ్లారు. అన్ని మున్సిపాలిటీల నుంచి గెలిచిన వారు క్యాంపులకు తరలివెళ్లారు. టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు రావడంతో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయమంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొట్టకపోగా, కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒక్క వార్డుతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఇక బొల్లారం మున్సిపాలిటీలో 22 వార్డులకు గానూ 17 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం.

ఆ ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండా...

ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌, మెదక్‌ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సంగారెడ్డి, నారాయణఖేడ్‌, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక మున్సిపాలిటీల్లో పోటీ వాతావరణం కనిపించింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు లభించకపోవడంతో రెబల్స్‌గా బరిలో దిగారు. వారితోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోటీ నెలకొనడం గమనార్హం. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 38 వార్డులకు గాను 18 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వారు టీఆర్‌ఎస్‌ నేతలతోనే ఉన్నారు. చేర్యాలలో 12 వార్డులకు గానూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ 5 చొప్పున వార్డులను కైవసం చేసుకున్నాయి. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరు కూడా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులే. అలాగే హుస్నాబాద్‌లో 20 స్థానాలకు 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 6 స్థానాలను కాంగ్రెస్‌, 2 స్థానాలను బీజేపీ, 3 స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక్కడ కూడా ముగ్గురు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ కావడం గమనార్హం. అన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గెలుపొందిన తరువాత పార్టీ ముఖ్యనేతలతో కలిసి మంత్రుల వద్దకు వెళ్లినట్లు తెలిసింది.

ఎక్స్‌అఫీషియో ఓటుతో ‘ఖేడ్‌' పీఠం...

ఎక్సఫీషియో ఓటుతో నారాయణఖేడ్‌ మున్సిపల్‌ పీఠాన్ని అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటున్నది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి 8, అధికార టీఆర్‌ఎస్‌కు 7 స్థానాలు వచ్చాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ ఉస్సేన్‌లు కూడా ఇక్కడే ఓటు వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ‘ఖేడ్‌'పై కూడా గులాబీ జెండా ఎగురనున్నదని ధీమాతో ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ కంటే ఓ స్థానాన్ని ఎక్కువే సాధించుకున్నప్పటికీ ఖేడ్‌ పీఠాన్ని పొందకపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే...

ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని ఈ మున్సిపల్‌ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైంది. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగింది. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఫలితాలు వచ్చాయి. అందుకు కష్టపడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో కృషి చేసిన ముఖ్య కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని ఒక్క టీఆర్‌ఎస్‌కే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అభినందనలు.
- తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

సీఎం కేసీఆర్‌పై విశ్వాసం చూపించారు..

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన పట్టణ ఓటర్లు మరోసారి సీఎం కేసీఆర్‌పై విశ్వాసం చూపించారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉన్నది. స్థానిక ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి మరోసారి సత్తా చాటారు. ఇక్కడి ఓటర్లకు, ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావులు ఇచ్చిన హామీలు, వారిపై నమ్మకంతో రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి అవసరమైన స్థానాలు గెలిపించడం శుభపరిణామం. ఆరు సంవత్సరాలుగా సీఎం కేసీఆర్‌ పరిపాలనలో అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు గెలుపునకు దోహదం చేశాయి. గెలుపు కోసం నిరంతరం సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఎంతో కృషి చేశారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.
- దేవీప్రసాద్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

ప్రజా విజయం...

అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీపై చూపించిన నమ్మకాన్ని వమ్ముచేయం. ఇది ప్రజా విజయం.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులే మా పార్టీ అభ్యర్థులను గెలిపించాయి. అభివృద్ధి చేసి చూపిస్తాం.  పట్టణ రూపు రేఖలు మార్చేస్తాం. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూస్తాం. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లోని సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి చేస్తాం.
- చంటి క్రాంతి కిరణ్‌, అందోలు ఎమ్మెల్యే


logo