శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 26, 2020 , 00:19:01

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు


రామాయంపేట: రామాయంపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది. శనివారం ఉదయం 8గంటలకు మొదలైన కౌంటింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. ఎన్నికల ఇన్‌చార్జి సాయిరాం, రామాయంపేట సీఐ.నాగార్జునగౌడ్‌ల నేతృత్వంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. మొదటి రౌండు నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందగా, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. రెండో రౌండ్‌లో ఇద్దరు టీఆర్‌ఎస్‌, ఒకరు బీజేపీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడో రౌండ్‌లో నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో రామాయంపేట పురపాలికపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయనున్నారు. ఒకటి, 12 వార్డులకు రీకౌంటింగ్‌ నిర్వహించగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజ యం సాధించారు.

ప్రజా విజయం మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి

ఇది ప్రజా విజయమని రామాయంపేట మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్‌లు అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కిందని అన్నారు.

డీలాపడిన టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీలు

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డు స్థానాలకు శనివారం జరిగిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌ మినహా మిగతా పార్టీల అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. కొత్తగా ఏర్పడిన తూప్రాన్‌ మున్సిపాలిటీ విస్తీర్ణం 33 చదరపు కిలోమీటర్లు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో తూప్రాన్‌, అల్లాపూర్‌, పోతరాజుపల్లి, రావెళ్లి, పడాల్‌పల్లి, వెంకటాపూర్‌(పీటీ), బ్రాహ్మణపల్లి గ్రామాలు ఉండగా, వీటి పరిధిలో 23,756 మంది జనాభా ఉంది. ఆయా వార్డుల పరిధిలో 17,658 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డు స్థానాలకు టీఆర్‌ఎస్‌ నుంచి 16 మంది, టీడీపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి 15 మంది, బీజేపీ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ చేయగా 35 మం ది అభ్యుర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆశలు అడియాశలయ్యాయి. కాంగ్రె స్‌ నుంచి 15 స్థానాల్లో పోటీచేస్తే 2 కౌన్సిలర్‌ స్థానాలకే పరిమితమైంది. బీజేపీ నుంచి 10 స్థానాలకు పోటీచేస్తే ఒక సీటును గెలుచుకోగలిగింది. 16 వార్డు స్థానాల్లో స్వతం త్ర అభ్యర్థులుగా 35 మంది పోటీచేస్తే వారిలో ఇద్దరూ మాత్రమే విజయం సాధించారు. మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డు స్థానాలకు గానూ టీఆర్‌ఎస్‌ -11, బీజేపీ-01, స్వతంత్రులు-02, కాంగ్రెస్‌ -02 స్థానాలు కైవసం చేసుకుంది.4వ వార్డు అభ్యర్థికి భారీ మెజార్టీ

తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మామిండ్ల జ్యోతికృష్ణకు భారీ ఆధిక్యత లభించింది. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బియ్యని వనజపై 626 ఓట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. 6వ వార్డులో ఒక్క ఓటుతో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థికి రీకౌంటింగ్‌ నిర్వహించారు.శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 6వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి పల్లెర్ల జ్యోతిరవీందర్‌కు 272 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి కొక్కొండ సమతకు 271 ఓట్లు వచ్చాయి. అయితే రీకౌంటింగ్‌ నిర్వహించడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి పల్లెర్ల జ్యోతిరవీందర్‌కు 272 ఓట్లు వచ్చినట్లు నిర్ధారించిన అధకారులు గెలుపును ఖరారు చేశారు.కాంగ్రెస్‌, టీడీపీలకు తగ్గిన ఓట్ల శాతం

ఈ నెల 22న జరిగిన తూప్రాన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓట్లశాతం పూర్తిగా తగ్గింది. 17,668 మంది ఓటర్లలో 14,484 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు 6726, టీడీపీకి 95, బీజేపీకి 1172, కాంగ్రెస్‌కు 1513, స్వతంత్ర అభ్యర్థులకు 4978 ఓట్లు పోలయ్యాయి.

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

తూప్రాన్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్‌ ఫార్మసి కళాశాలలో శనివారం జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా ఏఎస్పీ నాగరాజు పరిశీలించారు. తూప్రాన్‌ సీఐ స్వామిగౌడ్‌ పర్యవేక్షణలో తూప్రాన్‌, మనోహరాబాద్‌, శివ్వంపేట, వెల్దుర్తి ఎస్‌ఐలు సుభాష్‌, రమేశ్‌, కమలాకర్‌, గం గరాజుల ఆధ్వర్యంలో  సుమారు 100 మంది పో లీసు భద్రత మధ్య కౌంటింగ్‌ను నిర్వహించారు.

logo