గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 25, 2020 , 00:13:55

ఫలితం నేడే

ఫలితం నేడే


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నేటితో ఉత్కంఠకు తెరపడనుండటంతో అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 75 మున్సిపాలిటీలు ఉండగా రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. మిగతా 73 వార్డులలో 318మంది పోటీ చేయగా ఆ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.  నాలుగు మున్సిపాలిటీలలో మూడు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి కానున్నది.   మధ్యాహ్నం 1గంట వరకు అన్ని వార్డులకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.కౌంటింగ్‌ నిర్వహించనున్న  మెదక్‌ వైపీఆర్‌ కళాశాల, తూప్రాన్‌ నోబుల్‌ ఫార్మసీ కళాశాల,నర్సాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రామాయంపేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. - మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మెదక్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 73 వార్డులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ శనివారం జరుగనున్నది.  ఉదయం 8గంటలకు ఆయా కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటలలోనే కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వార్డుల సంఖ్యను బట్టి ఒకే హాలులో కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌, తూప్రాన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్‌ను జరుపనున్నారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వార ఎన్నికల కౌంటింగ్‌ సరళిని అధికారులు పరిశీలించనున్నారు. మొత్తం 73 వార్డుల్లో 318మంది పోటీ చేయగా ఆ అభ్యర్థుల ఫలితాలు నేడు తెలనున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి26 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. 26 టేబుళ్లకు ప్రతి టేబుళ్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లను కలెక్టర్‌ నియమించారు. మొత్తం ప్రతి టేబుల్‌కు 5మంది చొప్పున 26టేబుళ్లకు సంబంధించి 130మంది కౌంటింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి నాలుగు మున్సిపాలిటీల్లో మూడు రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి కానున్నది. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే వార్డుల ఫలితాలు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించనున్నారు. మెదక్‌ మున్సిపల్‌కు సంబంధించి 32వార్డులకు గాను 2వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 30వార్డులకు సంబంధించి స్థానిక వైపీఆర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగునున్నది.

30 వార్డులకు 11టేబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవిధంగా అధికారులు ఏర్పాటు చేశారు. 11 టేబుళ్లలో 3రౌండ్లలో మొత్తం 30వార్డులకు సంబంధించి కౌంటింగ్‌ పూర్తయ్యేవిధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. 1వ రౌండ్‌లో 1,4,7,10,13,16,19,22,25,28,31 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 2వ రౌండ్‌లో 5,8,11,14,17,20,23,26,29 వార్డులకు సంబంధించి లెక్కింపు జరుగుతున్నది. 3వరౌండ్‌లో 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 వార్డులకు సంబంధించి లెక్కింపు జరుగుతున్నది. తూప్రాన్‌ మున్సిపాలిటీ సంబంధించి 16వార్డులకు సంబంధించి తూప్రాన్‌కు సమీపంలోని లింగారెడ్డిపేట నోబుల్‌ ఫార్మసీ కళాశాలలో లెక్కింపు ఉంటుంది. 16వార్డులకు 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. 1వ రౌండ్‌లో 1,4,7,10,13 వార్డులకు సంబంధించి లెక్కింపు జరుగనున్నది. 2వ రౌండ్‌లో 2,5,8,11,14వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనుంది. 3వ రౌండ్‌లో 3,6,9,12,15,16వార్డులకు సంబంధించి లెక్కింపు జరుగనున్నది. నర్సాపూర్‌ మున్సిపాలిటీ సంబంధించి 15వార్డులకు సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్కింపు జరుగనున్నది. 15వార్డులకు 5టేబుళ్లను ఏర్పాటు చేశారు. 3రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 1వ రౌండ్‌లో 1,4,7,10,13 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 2వ రౌండ్‌లో 2,5,8,11,14వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 3వ రౌండ్‌లో 3,6,9,12,15 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది. రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి 12వార్డులకు సంబంధించి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 12 వార్డులకు 04టేబుళ్లను ఏర్పాటు చేశారు. 3రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 1వ రౌండ్‌లో 1,4,7,10 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 2వ రౌండ్‌లో 2,5,8,11 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 3వ రౌండ్‌లో 3,6,9,12వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనున్నది.

భారీ బందోబస్తు...

నాలుగు మున్సిపాలిటీల్లో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎస్పీ చందన్నదీప్తి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారితో పాటు 03 సీఐలు, 15మంది ఎస్‌ఐలతో భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగనున్న కేంద్రాలు మెదక్‌లోని వైపీఆర్‌ కళాశాల, తూప్రాన్‌ నోబుల్‌ ఫార్మసీ కళాశాల,నర్సాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రామాయంపేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మొత్తం పోలీసు నిఘా నీడలో ఉన్నాయి.  భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగనున్నది.

తూప్రాన్‌లో కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ 

తూప్రాన్‌ రూరల్‌ : నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు. మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్‌ ఫార్మసి కళాశాలలో ఏర్పాటు చేసిన తూప్రాన్‌ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కౌంటింగ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలు, కౌంటర్‌లను ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు చేసే విధానంపై రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కళాశాల ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  మధ్యాహ్నం 12 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. వార్డులు ఎక్కువ ఉన్న చోట్ల కాస్త ఆలస్యంగా కౌంటింగ్‌ పూర్తవుతుందన్నారు. ప్రతి టేబుల్‌లో ఒక్కొక్క వార్డుకు ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఒక వార్డు పూర్తి కాగానే మరో వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి టేబుల్‌కు ఒక ఆర్వో, ఒక ఏఆర్వో ఉంటారన్నారు. ప్రతి టేబుల్‌లో జరిగే ఓట్లలెక్కింపును సూపర్‌వైజర్‌తో పాటు  ఇద్దరు అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌లు పర్యవేక్షిస్తారన్నారు. కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామోజియోద్దీన్‌తో పాటు రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

27న చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక..

ఈ నెల 27న ఆయా మున్సిపాలిటీల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అదే రోజూ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.logo