సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 25, 2020 , 00:13:05

పట్టు పరిశ్రమకు ప్రోత్సాహం

పట్టు పరిశ్రమకు ప్రోత్సాహం


సిద్దిపేట ప్రతినిధి/ కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు.. రైతులకు 24 గంటల కరెంట్‌ తోపాటు రైతుబంధు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇచ్చి, ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తూ.. ప్రతి అడుగు రైతు సం క్షేమం కోసమే వేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్‌లో రాష్ట్రస్థాయి పట్టు రైతుల సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్థసారధి, ఉద్యానవన, పట్టు పరిశ్రమ సంచాలకుడు వెంకట్రామ్‌రెడ్డి, కేంద్రీయ పట్టు సంస్థ అధికారి రజిత్‌ రంజన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, జేసీ పద్మాకర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్‌ నాగిరెడ్డి, పట్టు పరిశోధన, శిక్షణ సంస్థ శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి పాల్గొన్నారు.  ముందుగా స్టాల్స్‌ను ప్రారంభించి పట్టు ఉత్పత్తులకు వినియోగించే పరికరాలను తిలకించారు. ఈ సందర్భంగా రూ.6వేల విలువైన పట్టు వస్త్రాలను కొనుగోలు చేశారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 35 శాతం నిధులను కేటాయించి, వ్యవసాయ ఆధార రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టుకు కిలోకు రూ.25 నుంచి రూ.75 సబ్సిడీ పెంచిందన్నారు. రైతులు పట్టు పరిశ్రమను సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. ఉపాధి పథకంలో పట్టు పరిశ్రమకు అవసరమైన షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతామన్నారు. అలాగే, మల్బరీ సాగుతో ఆదాయం పెంపొందించుకోవచ్చన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పట్టుకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని చెప్పారు. తెలంగాణకు అదనంగా 3 రేలింగ్‌ యూనిట్లు మం జూరు చేస్తామని కేంద్రీయ పట్టు సంస్థ సభ్యులు రజిత్‌ రంజన్‌ తెలిపినట్లు మంత్రి హరీశ్‌రావు వివరించారు.
 

రాష్ట్రంలో రూ.1400 కోట్ల పట్టు ఉత్పత్తులు

-   వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగానికి సాంకేతికతను జోడించి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. సెరికల్చర్‌ను ప్రాధాన్యత రంగంగా ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11 వేల పైచిలుకు ఎకరాల్లో పట్టు సాగవుతుందని, పట్టు ఉత్ప త్తులు రూ.1400 కోట్ల టర్నోవర్‌ చేరిందన్నారు. 

 రూ.5.38 కోట్ల చెక్కుల పంపిణీ

 పట్టు పరిశ్రమను స్థాపించిన వారికి వివిధ పథకాల కింద రూ.5.38 కోట్ల రాయితీ చెక్కులను పంపిణీ చేశారు.  సదస్సులో బిందు సేద్యం, ఫామ్‌ మెకనైజేషన్‌ యంత్రాలు, రేరింగ్‌ హౌస్‌, ఫాగింగ్‌, ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.  సదస్సుకు వివిధ జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది రైతులు, ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌, సుడా చైర్మన్‌, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్‌ బూర విజయ పాల్గొన్నారు.

 పట్టు పరిశ్రమ ఏర్పాటుతో ఉపాధి

పట్టు సాగుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పట్టు నాణ్యమైనది. మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది. మన వాతావరణ పరిస్థితులు పట్టు పరిశ్రమకు అనుకూలం. పట్టు పరిశ్రమ సిద్దిపేటలోని వేములఘాట్‌లో ప్రారంచాము. నేడు రాష్ట్రవ్యాప్తంగా 11 నుంచి 12 వేల ఎకరా ల్లో పట్టును సాగు చేస్తున్నారు. నేడు పట్టు సాగులో అనేక నూతన టెక్నాలజీతో సాగు చేయడం వల్ల లాభాలు పొందవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పట్టు ఉత్పత్తి కావడం లేదు. అందుకే పట్టు రైతులకు మంచి మార్కెట్‌ సౌకర్యంతో పాటు మంచి ధర లభిస్తుంది.
- పార్థసారధి (రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ) logo