శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Jan 25, 2020 , 00:11:03

భక్తజనసంద్రం

భక్తజనసంద్రం


పాపన్నపేట : భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచి, అడిగిందే తడవుగా భక్తుల కోరికలు తీర్చే కరుణమాతగా కీర్తింపబడే ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధితో పాటు ఏడుపాయల అటవీ ప్రాంతం శుక్రవారం జనారణ్యంగా మారిపోయింది, మాఘ అమావాస్య రోజు అమ్మవారి సన్నిధిలో గలగలపారే మంజీరానదిలో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందన్న నమ్మకానికి తోడు అమ్మవారి దీవెనలు అందుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం భక్తులు మంజీరానదిలో అదేవిధంగా చెక్‌ డ్యామ్‌ వద్ద పుణ్యస్నానాలు చేసిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో ఏడుపాయల అధికారులు నిమగ్నమయ్యారు. ఏడుపాయల ఈవో శ్రీనివాస్‌ ఎప్పటికప్పుడు సిబ్బందితో ఏడుపాయలలో పర్యటిస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. భక్తుల కోసం ఆలయం ఎదుట, చెక్‌డ్యామ్‌ వద్ద ఘనపూర్‌ ఆనకట్ట సమీపాన షవర్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడా క్యూలైన్లతో పాటు చలువ పందిళ్లు సైతం ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు.

దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిన ఏడుపాయల..

ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో వేకువజాము నుంచి దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది. భక్తులు మంజీరానదిలో స్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం, బోనాలు, తలనీలాలు సమర్పించారు. ఇక స్నాన వాటికల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. 

వేకువజాము నుంచే అమ్మవారికి పూజలు..

అమావాస్య పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు భక్తులు తరలివస్తారు అనే ఉద్దేశంతో వేకువజామునే ఆలయం తెరిచి అమ్మవారికి అర్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. మాఘ అమావాస్య సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన పూలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలకరించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్‌సైతం ఏర్పాటు చేశారు.

రెండు మార్గాల్లో ఏడుపాయలకు చేరిన భక్తులు..

మాఘ అమావాస్య స్నానాలు చేయడానికి ఏడుపాయలకు వేలాది భక్తులు తరలివచ్చారు. గతంలో కేవలం నాగ్సాన్‌పల్లి కమాన్‌వైపు నుంచి మాత్రమే ఏడుపాయలకు భక్తులు రావడానికి దారి ఉండేది దీంతో అన్ని ప్రాంతాల భక్తులు అదే మార్గం గుండా వచ్చేవారు. అప్పట్లో మరికొంత మంది ఘణపూర్‌ ఆనకట్ట మీది నుంచి కూడా నడుచుకుంటూ ఏడుపాయల చేరుకునేవారు. ఇటీవలే పొతంశెట్టిపల్లి వైపు నుంచి కూడా మంజీరానదిపై బ్రిడ్జిలు నిర్మించి దారి ఏర్పాటు చేయడంతో భక్తులు ఆ వైపు నుంచి కూడా పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. ముఖ్యంగా సంగారెడ్డి, హైదరాబాద్‌, నర్సాపూర్‌, తదితర ప్రాంతాల వారు పొతంశెట్టిపల్లి వైపు నుంచి ఏడుపాయలకు చేరుకోగా, బీదర్‌, నారాయణఖేడ్‌, మెదక్‌ ప్రాంతాల వారు నాగ్సాన్‌పల్లి వైపు నుంచి ఏడుపాయల చేరుకున్నారు. పోతంశెట్టిపల్లి వైపు నుంచి వచ్చి వారు ప్రైవేట్‌ వాహనాల్లో రాగా నాగ్సాన్‌పల్లి వైపు నుంచి వచ్చిన వారు ప్రైవేట్‌ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులల్లో కూడా ఏడుపాయలకు చేరుకున్నారు.

పోలీసు బందోబస్తు..

ఏడుపాయలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏడుపాయలలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఐలు 15మంది ఎస్సైలు 100మంది పోలీలసు సిబ్బందితో ఏడుపాయలలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. జాతర జరుగడానికి కొన్ని గంటల ముందు ఏడుపాయలలో మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులకు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ రాజశేఖర్‌తో పాటు పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు. భద్రతపై తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.

చాముండేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

చిలిపిచెడ్‌ :మాఘ అమావాస్య సందర్భంగా చాముండేశ్వరీ అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  చిలిపిచెడ్‌ మండలంలోని చిట్కుల్‌ గ్రామ శివారులో ఉన్న చాముండేశ్వరీ ఆలయానికి శుక్రవారం మాఘ అమావాస్య సందర్భంగా భక్తులతో రద్దీ నెలకొన్నది. ఆలయానికి సుమారుగా భక్తులు 30 వేలకు పైగా రావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మంజీరానది, ఆలయం వద్ద భారీ పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్‌ఐ మల్లయ్య, కౌడిపల్లి ఎస్‌ఐ రాజశేఖర్‌ తన సిబ్బందితో ఆలయం, మంజీరానది వద్ద దగ్గర ఉండి వచ్చిన భక్తులకు, రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో ఎలాంటి ఘటనలు జరుగకుండా నర్సాపూర్‌ సీఐ నాగయ్య ఎప్పటికప్పుడూ భక్తులను, ఆలయ ఏర్పాట్లును పర్యవేక్షించారు.

కిటకిటలాడిన కొప్పోల్‌..

పెద్దశంకరంపేట : మాఘ అమావాస్య సందర్భంగా దక్షిణకాశీగా పేరుగాంచిన కొప్పోల్‌ ఉమాసంగమేశ్వర ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది.  అమావాస్య కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్య స్నానాలాచరించి స్వయంభూలింగం గా వెలసిన శివలింగానికి జలాభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామున నుంచే బారులు తీరారు. ఆలయంలో స్వామివారికి వేదబ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు కిష్టప్పగారి సంగమేశ్వర్‌ తాగునీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు పేట చుట్టుపక్కల మండలాలైన రేగోడ్‌, అల్లాదుర్గం, జోగిపేట, నారాయణఖేడ్‌, కల్హేర్‌, టేక్మాల్‌, పాపన్నపేట మండలాల ప్రజలు సుమారు 10వేల భక్తులు దర్శించుకున్నారు. పూజారి సంగప్ప లింగాష్టకాలతో బిల్వార్చన, రుద్రాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు, ఆలయ కమిటీ సభ్యులు పద్మబాపిరాజ్డు, రాయిని విఠల్‌, గాండ్ల సంగమేశ్వర్‌, ఆర్‌.ఎన్‌ సంతోశ్‌ కుమార్‌, ప్రభులు సార్‌, రాయిని రాములు, కందుకూరి నర్సింహులు, శంకరయ్య, సంగయ్య, ఆయా గ్రామాల సర్పంచులు రమేశ్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు..

కొల్చారం :కొల్చారం మండలంలోని పలు చోట్ల మాఘ అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంజీరానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న హనుమాన్‌ బండల్‌ వద్ద మంజీరానదిలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పుణ్యస్నాణమాచరించారు. అనంతరం హనుమాండ్లకు  పూజారి కోలాచల కృష్ణశర్మ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ గౌరీశంకర్‌, అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి అయిన మాధవానంద సరస్వతీస్వామి ఉదయమే తుక్కాపూర్‌ శివారులోని మంజీరానదిలో పుణ్యస్నానమాచరించి మధనానంద ఆశ్రమంలో లింగాభిషేకం చేశారు. కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గేశ్‌, గొండ కృష్ణ, మల్లేశం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


logo