బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 24, 2020 , 04:51:38

ఓటెత్తిన మహిళలు

ఓటెత్తిన మహిళలు
  • -ఓటింగ్‌లో వారిదే పైచేయి
  • -జిల్లాలో 81.84 శాతం మహిళా ఓటింగ్‌ నమోదు
  • -ఓటింగ్‌లో మహిళల్లో పెరుగుతున్న చైతన్యం
  • -ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలు
  • -మొత్తం మహిళలు 38,143, ఓటేసింది 31,218 మందిమున్సిపల్‌ ఎన్నికల్లో మహిళల చైతన్యం వెల్లివిరిసింది. ఈసారి మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం చేపపట్టిన వివిధ రకాల అవగాహన కార్యక్రమాలతో ఓటు హక్కుపై మహిళల్లో చైతన్యం పెరిగింది. ఇటీవల కాలంలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా  ఓటింగ్‌  81.84  శాతం నమోదైంది.  నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 38,143  మంది మహిళా ఓటర్లుండగా, 31,218 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రామాయంపేటలో  మహిళల ఓటింగ్‌ 87.11  శాతం నమోదైంది.
-మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :నాలుగు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓట్లే అత్యధికంగా పోలయ్యాయి. అన్ని మున్సిపాలిటీలలో 38,143 మహిళా ఓటర్లు ఉండగా 31,218 మహిళల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.84 శాతం మహిళలు ఓటు వేసి తమ సత్తా చాటుకున్నారు. మెదక్‌, రామాయంపేట, నర్సాపూర్‌ మున్సిపాలిటీలలో మహిళా ఓటర్లే అత్యధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ మున్సిపాలిటీలో 16,198 మహిళా ఓటర్లు ఉండగా 13,205 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా రామాయంపేటలో 6,029 మహిళలు ఉండగా 5,252 ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్‌లో 7,086 మహిళలు ఉండగా 5,592 ఓట్లు పోలయ్యాయి. తూప్రాన్‌లో 8,830 మహిళా ఓట్లు ఉండగా 7,169 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా రామాయంపేటలో 87.11 శాతం మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండో స్థానంలో మెదక్‌ మున్సిపాలిటీలో 81.67శాతం మహిళలు ఓటింగ్‌లో పాల్గొని మహిళలు తమ సత్తా చాటారు. నర్సాపూర్‌లో 78.97శాతం మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. తూప్రాన్‌లో 81.18 శాతం మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఇదిలా వుండగా 4 మున్సిపాలిటీలలో పురుషుల పోలైన వివరాలు ఓట్లు ఇలా ఉన్నాయి. మెదక్‌లో 15,108 పురుషుల ఓట్లు ఉండగా 12,498 ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్‌లో 7,072 పురుషుల ఓట్లు ఉండగా 5,585 ఓట్లు పోలయ్యాయి. తూప్రాన్‌లో 8,828 పురుషుల ఓట్లు ఉం డగా 7,315 ఓట్లు పోలయ్యాయి. రామాయంపేటలో 5,737 పురుషుల ఓట్లు ఉండగా 4,881 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల శాతం పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మెదక్‌లో 82.72 శాతం పురుషుల ఓటింగ్‌ నమోదు కాగా నర్సాపూర్‌లో 78.97 శాతం, తూప్రాన్‌లో 82.86 శాతం, రామాయంపేటలో 85.07 శాతంగా పోలింగ్‌ నమోదైంది. 

మహిళలదే పైచేయి..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారు. 81.84శాతం మహిళలు ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడంలో మహిళలు తమ సత్తా చాటారు. తూ ప్రాన్‌ మినహా మిగిలిన మూడు పట్టణాల్లో పురుషుల కంటే మహిళలే తమ ఓటు హక్కును సద్వినియో గం చేసుకున్నారు.logo