శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 24, 2020 , 04:51:38

సమ్వయంతో సాధించారు

సమ్వయంతో సాధించారు


మెదక్‌, నమస్తే తెలంగాణ :
జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. మెదక్‌ మున్సిపాలిటీలో 30 వార్డులకు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 వార్డులకు, తూప్రాన్‌ మున్సిపాలిటీలో 16 వార్డులలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో అధికారులు, పోలీసుల పనితీరు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

అధికారుల ముందస్తు ప్రణాళిక..

జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తితో పాటు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కలెక్టర్‌ ధర్మారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌ ఎప్పటికప్పుడూ ఎన్నికల అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేస్తూ అన్ని ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపాలిటీ ఓటర్ల జాబితా నుంచి మొదలు ఎన్నికలు ముగిసేవరకు అధికారులు ప్రతీ విషయాన్ని పర్యవేక్షిస్తూ ముందస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా బాగా జరిగాయని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

పోలీసుల పకడ్బందీ ప్రణాళిక, శాంతియుతంగా ఎన్నికలు..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడంలో ముఖ్య భూమిక పోషించారనే చెప్పాలి. ఎస్పీ చందనదీప్తి జిల్లాలోని పోలీసులను ముందస్తుగా అప్రమత్తం చేశారు. ఇప్పటికే శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపిన అనుభవం ఉన్న ఎస్పీ ఈ ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడూ తగిన సలహాలు, సూచనలు చేస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగకపోవడం జిల్లా పోలీసు పనితనానికి నిదర్శనమనే చెప్పాలి. ఇలా అన్ని శాఖల అధికారుల సమన్వయం, ప్రజల సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


logo