శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medak - Jan 23, 2020 , 01:40:09

ముగిసిన ‘మున్సి’పోరు

 ముగిసిన ‘మున్సి’పోరు


మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పక్కాగా ప్రణాళికలు రూపొందించడంతో ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిగాయి. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 82.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించిన అధికారులు ఆ సమయం వరకు క్యూలో నిలబడ్డ వారికి సైతం అవకాశం కల్పించారు.

అన్ని మున్సిపాలిటీల్లో భారీగా పోలైన ఓట్లు..

మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 31,306 ఓట్లకు గాను 25,703 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 13,205మహిళలు, 12,498 పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో మొత్తం 17,655 ఓటర్లకు గాను 13,215ఓట్లు పోలయ్యాయి. మహిళలు 8,730, పురుషులు 8,728 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 14,155గాను 11,177 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 5,592,   పురుషులు 5,585 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 11,766మంది ఉండగా 10,133ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 5,252మంది, 4,881పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం నుంచి జోరుగా...

ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ జోరుగా సాగింది. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అన్ని మున్సిపాలిటీల్లో జనం భారీగా క్యూలలో నిలబడ్డారు. అయితే రామాయంపేట శివారు గుల్ గ్రామంలో శివారు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ క్యూలు కనిపించగా పట్టణం నడిబొడ్డున ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే బారులు తీరారు. అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ భారీగానే నమోదైంది. జిల్లాలో ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించడంతో పోలింగ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. వృద్ధులు, మహిళలు సైతం ఓట్ల కోసం బారులు తీరారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులను వంద మీటర్ల దూరంలోనే ఉంచారు. జిల్లాలో చిన్న ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మెదక్ 13వ వార్డులో ఉదయం 11గంటల ప్రాంతంలో  గొడవ జరగడంతో డీఎస్పీ కృష్ణమూర్తి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. నర్సాపూర్ సైతం 2,6వ వార్డుల్లో కొంత  ఉద్రిక్త  నెలకొనడంతో పోలీసులు చేరుకొని పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల దూరంలో అభ్యర్థులను దూరంగా ఉంచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

జిల్లాలో 82.12 శాతం పోలింగ్..

జిల్లావ్యాప్తంగా 82.12 శాతం పోలింగ్ నమోదయింది. ఇందులో అత్యధికంగా రామాయంపేట మున్సిపాలిటీలో 86.12 శాతం నమోదు కాగా, తక్కువగా నర్సాపూర్ మున్సిపాలిటీలో78.94 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. మిగతా మున్సిపాలిటీల్లో మెదక్ మున్సిపాలిటీ 82.10 శాతం కాగా, తూప్రాన్ మున్సిపాలిటీలో 82.05 శాతం నమోదు అయ్యింది.  ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాధారణంగా నమోదైన ఓటింగ్ శాతం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెరుగుతూ పోయింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు సైతం సొంత పట్టణాలకు వచ్చి ఓటేశారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ ధర్మారెడ్డి

పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. ఆయన మెదక్ పట్టణంలోని 13వార్డు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని పోలింగ్ కేంద్రం అంబేద్కర్ కాలనీ, గీతా జూనియర్ కళాశాల, ప్రగతి విద్యామందిర్ తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జేసీ నగేశ్ సైతం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అధికారులు, సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు గురించి తగిన సూచనలు చేశారు. మెదక్ మున్సిపాలిటీల్లో పోలీసు బందోబస్తును, ఎన్నికల తీరు తెన్నులను డీఎస్పీ కృష్ణమూర్తి పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు.. జితేశ్ వి పాటిల్

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు జితేశ్ వి పాటిల్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రామాయంపేట, తూప్రాన్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వీరే కాకుండా మైక్రో అబ్జర్వర్లు పలు కేంద్రాలను సందర్శించారు.

పోలీసుల కట్టుదిట్టమైన భద్రత...

జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. గత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావీయకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. సీసీ కెమెరాలు ఉపయోగించి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 38 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 51 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయడంతో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకుని తగిన చర్యలు తీసుకున్నారు. ఎస్పీ చందనదీప్తి, ఏఎస్పీ నాగరాజు, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ మదన్ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ శేరిసుభాశ్  కార్యకర్తలు, నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్ మెదక్ ఉండి ఓటింగ్ సరళిని పరిశీలించారు.logo