సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 22, 2020 , 04:51:21

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి


మెదక్ కలెక్టరేట్ : ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకుని, వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సెర్ప్ ఏపీఎంలను, సీసీలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సెర్ప్ ఏపీఎంలు, సీసీలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో 95 శాతం మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. సమాజంలో మార్పునకు మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం సమాజంలో మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, తడి, పొడి చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని వివరించారు. ఈ అంశాలపై ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలంటే ముందుగా వీటి సెర్ప్ ఉద్యోగులకు సరైన అవగాహన ఉండాలన్నారు.

ఈ అంశం ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్నదన్నారు. మరుగుదొడ్డి లేనివారు సత్వరం నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థలం లేనివారికి కమ్యూనిటీ టాయిలెట్ నిర్మించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ  గ్రామాల్లోని మహిళా సమాఖ్య సమావేశాల్లో ఈ అంశాలపై ప్రథమంగా చర్చించాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు నిర్మించిన వాటిని వినియోగించుకునేలా చైతన్యపర్చాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ పై ప్రతి మహిళ తమ ఇంటి నుంచే వేరు చేయాలన్నారు. మహిళలకు అవగాహన ఉన్నప్పుడే ఈ అంశాలు ముందుకు సాగుతాయన్నారు.

ఇందులో భాగంగానే ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. కొన్ని గ్రామాల్లో కొంత మంది కంట్రోల్ వాల్వ్ తొలిగిస్తున్నారని, ఇలా చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇలాచేస్తే కొన్ని ఇండ్లకు తాగునీరు సరఫరా కాక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యత, క్రమశిక్షణ, విలువలు నేర్పి ఇలాంటి చర్యలు పాల్పడకుండా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామైఖ్య సంఘాల సమావేశాల్లో వీటన్నింటిపై చర్చించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సీతారామారావు, డీపీవో హనోక్, ఆర్ ఈఈ కమలాకర్, ఏపీడీ బీమయ్య తదితరులు పాల్గొన్నారు.


logo