ఆదివారం 24 మే 2020
Medak - Jan 21, 2020 , 00:37:32

ముగిసిన ఎన్నికల ప్రచారం

ముగిసిన ఎన్నికల ప్రచారం


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వారం రోజుల పాటు అభ్యర్థులు, నాయకులు వారి అనుచర గణంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారాలతో హోరెత్తించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల అభ్యర్థులు ప్రచారానికి ముగింపు పలికారు. చివరి రోజు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వారం రోజుల పాటు మంత్రి హరీశ్‌రావు అన్నీ మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులు గడపగడపకు తిరిగి ఓట్లు అడిగారు. మైకులు, ఆటో రిక్షాలు, వాహనాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం 5 గంటల వరకు ప్రచారాన్ని ముగించారు. ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారంలోకి దిగి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో పాటు పాదయాత్రలు, ప్రచార సభలతో హోరెత్తించారు. ఒక్కో వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓట్లను అడిగారు. ప్రతి ఇంటికి చేరుతున్న సంక్షేమ పథకాలు, ప్రతీ వీధిలో కనిపిస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం చేశారు.

జిల్లాలో 73 వార్డులలో ప్రచారం ఉధృతంగా సాగింది. మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీలలో 75 వార్డులకుగాను మెదక్‌లో రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 73 వార్డులలో పోటీ జరుగుతున్నది. రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, మిషన్‌భగరీథ తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచార ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో ఉత్సహంగా పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలలోని అన్ని వార్డులోనూ ఆటోలు, కార్యకర్తల ర్యాలీలు, అభ్యర్థుల ప్రచార జోరు కనిపించింది. పార్టీ కార్యకర్తలతో కలిసి కరపత్రాలతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని వేడుకున్నారు.

నేటితో ముగిసిన ప్రచార ఘట్టం..

ఇక పోలింగ్‌కు 48 గంటల సమయం సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్‌ రాగా 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఇచ్చారు. 14న ఉపసంహరణకు తుది గడువు ఇవ్వడంతో అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. వెనువెంటనే అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. వారం రోజుల పాటు అభ్యర్థులకు ప్రచారానికి ఎన్నికల కమిషన్‌ గడువు పెట్టడంతో సోమవారంతో ప్రచారం పరిసమాప్తం చేశారు. దీంతో చివరిరోజైన సోమవారం అన్ని మున్సిపాలిటీల వార్డులలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతో ప్రచారాన్ని ముగించారు.

ఈ నెల 22న పోలింగ్‌

నాలుగు మున్సిపాలిటీలలో ఈ నెల 22న పోలింగ్‌ జరుగనున్నది. జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో 150 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ

అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్‌ సామగ్రిని మంగళవారం పంపిణీ చేసేందుకు అధికారులు  ఏర్పాట్లు చేశారు.logo