శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medak - Jan 20, 2020 , 02:35:01

నేటితో ప్రచారం పరిసమాప్తం

నేటితో ప్రచారం పరిసమాప్తం


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వారం రోజుల పాటు అభ్యర్థులు, నాయకులు వారి అనుచర గణంతో జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ప్రచారాలతో హోరెత్తించారు. ఈ నెల  14న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారంలోకి దిగి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారంతో పాటు పాదయాత్రలు, ప్రచార సభలతో హోరెత్తించారు. ఒక్కో వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. తమకే ఓటు వేయాలని అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓట్లను అడిగారు. ప్రతి ఇంటికి చేరుతున్న సంక్షేమ పథకాలు, ప్రతి వీధిలో కనిపిస్తున్న అభివృద్ధి పనులు ప్రచారంలో ఎన్నికల అస్ర్తాలుగా మారాయి. 73 వార్డుల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, మాజీ మంత్రి సునీతారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, ఇఫ్కో డైరక్టర్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట , తూప్రాన్‌ మున్సిపాలిటీలలో 75 వార్డులకు గాను మెదక్‌ మున్సిపాలిటీలో 2వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేదవతి రాములు, 32వ వార్డు  మానస సాయిరాం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగ ఎన్నికైన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, అసరా పింఛన్లు, మిషన్‌భగీరథ తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నేడు సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం పరిసమాప్తం కానున్నది. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం సమాప్తం కానున్నందున ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అభ్యర్థులు ప్రచారానికి ముగింపు పలుకనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు ప్రచారానికి రాలేక ముఖం చాటేశారు. ఎంఐఎం అభ్యర్థుల తరఫున హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్థానిక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో ఉత్సహంగా పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులోను ఆటోలు, కార్యకర్తల ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారహోరు కన్పిస్తున్నది. కరపత్రాలతో అభ్యర్థులు వారి వెంట అయా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు..

ప్రచారంలో అందరికంటే ముందు నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గడపగడపకు వెళ్లి వివరిస్తూ టీఆర్‌ఎస్‌ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, అసరా పింఛన్లు, కేసీఆర్‌కిట్టు, రైతుబీమా, రైతుబంధు, మిషన్‌భగీరథ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. 


logo