గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Jan 19, 2020 , 00:49:59

నేడు రెండో విడుత వాయుసేన ర్యాలీ

నేడు రెండో విడుత వాయుసేన ర్యాలీ


పుల్కల్‌: సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న 12వ వాయుసేన ఉద్యోగ ర్యాలీ మొదటి విడుత జిల్లాలు పూర్తి కావడంతో ఆదివారం రెండో విడుతకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడుతలో 15 జిల్లాల నుంచి పాల్గొన్న అభ్యర్థులను ఎంపిక చేశారు. ర్యాలీలో 24000 మంది పాల్గొనగా, వివిధ రకాల శారీర దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షల అనంతరం 92 మందిని ఎంపిక చేశారు. ఆటోటెక్నీషియన్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగాలకు నియామకాలు చేస్తున్నారు.

రెండో విడుతలో పాల్గొనే జిల్లాలు..

1.అదిలాబాద్‌, 2.కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, 3. మంచిర్యాల, 4.నిర్మల్‌, 5.కరీంనగర్‌, 8.జగిత్యాల, 9.పెద్దపల్లి, 10.రాజన్న సిరిసిల్ల, 11.భద్రాది కొత్తగూడెం, 12.ఖమ్మం, 13.జోగులాంబ గద్వాల, 14.మహబూబ్‌నగర్‌, 15. నాగర్‌కర్నూల్‌, 16.వనపర్తి, 17.మెదక్‌, 18.సంగారెడ్డి, 19.సిద్దిపేట జిల్లాల అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు 20వ తేదీన ఉదయం 5గంటల లోపు జేఎన్‌టీయూ ప్రాంగణానికి రావాల్సి ఉంటుంది. దూరం నుంచి వచ్చే అభ్యర్థులు 19వ తేదీన కళాశాలకు చేరుకోవచ్చు. వీరికి  కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో భోజనాలు, బోర్డింగ్‌ సదుపాయం కల్పించారు.

5 గంటల్లోగా కళాశాలకు చేరుకోవాలి..

రెండో విడుత వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 19వ తేదీన ఉదయం 5గంటల్లోగా జేఎన్‌టీయూ కళాశాలకు చేరుకోవాలి. మెయిన్‌ గేట్‌ వద్ద ముందుగా ఎత్తు కొలతలు తీసుకుని ఎంపికైన అర్హులకు శారీరకదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆటో టెక్నీషియన్‌కు 165 సెంటిమీటర్లు, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పోలీస్‌ ఉద్యోగానికి 175 సెంటిమీటర్ల ఎత్తు ఉన్న అభ్యర్థులను మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు రన్నింగ్‌, పుషప్స్‌, స్కాట్స్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన వారికి రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 20వ తేదీన మెంటల్‌ ఎబిలిటీ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నాలుగు జిరాక్సు సెట్లు వెంట తెచ్చుకోవాలని వాయిసేన అధికారులు తెలిపారు.

మొదటి విడుతలో 92 మంది ఎంపిక..

మొదటి విడుత నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో వివిధ టెస్టుల అనంతరం 92 అభ్యర్థులను ఎంపిక చేశామని ఎయిర్‌మెన్‌ సెంట్రల్‌ సెలక్షన్‌ బోర్డు కెప్టెన్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. 12వ వాయు సేన ఉద్యోగనియామకం ర్యాలీకి భారీ ఎత్తున యువకులు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. మొదటి విడుతలో ఎంపికైన అభ్యర్థులను దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి తరలించారు.logo