సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 19, 2020 , 00:48:36

పాఠశాలల్లో పెండింగ్‌ నిర్మాణాలను పూర్తి చేయండి

పాఠశాలల్లో పెండింగ్‌ నిర్మాణాలను పూర్తి చేయండి


మెదక్‌ కలెక్టరేట్‌ : పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మూత్ర శాలల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం  కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో  ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభం కాని ప్రాంతాల్లో ఎస్‌ఎంసీ కమిటీలతో నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలని సూచించారు. నిధులు మంజూరు చేసినా మరుగుదొడ్ల పనులు పూర్తి కాకపోవడంపై  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మరమ్మతులు ఉన్న పాఠశాలల్లో స్థానిక సర్పంచుల సహకారం తీసుకోవాలన్నారు.

రేపటిలోగా మంజూరైన మూత్రశాలలు వాటి పురోగతి వివరాలను అందజేయాలని డీఈవో రమేశ్‌కుమార్‌కు సూచించారు. మన పల్లె బడి-మన ధర్మనిధి కార్యక్రమంలో భాగంగా సమకూరిన నిధులతో ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలలకు సైతం క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన వారి వివరాలను తీసుకుని, వారితో తరచూ మాట్లాడి వారు గ్రామానికి వచ్చినప్పుడు పాఠశాలను సందర్శించేలా చూడాలని ఎంఈవోలకు సూచించారు. ఇలా చేయడం వల్ల నిధులు సమకూరడంతో పాటు విద్యార్థులు జీవితంలో ఎదిగేందుకు వారి అనుభవాలు ఉపయోగపడుతాయన్నారు.

డిప్యుటీ ఇంజినీర్‌పై ఆగ్రహం...

పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన సంస్థ నుంచి మంజూరైన పనులు జిల్లాలో నత్తనడకన సాగడంపై ఆ శాఖ డీఈఈ సుదర్శన్‌ పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవోలు పనుల పురోగతిని వివరించడంతో ఫోన్‌లో డీఈఈతో మాట్లాడారు. వారం రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులను మూడు నెలలుగా పూర్తి చేయకపోవడం ఇంజినీరింగ్‌ అధికారుల అసమర్థతకు నిదర్శనమన్నారు. గుత్తేదారులు పనులు చేయకపోతే వేరేవారికి అప్పగించాలన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయకుంటే ఈఎన్‌సీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రమేశ్‌కుమార్‌, నోడల్‌ అధికారి మధుమోహన్‌తో పాటు వివిధ మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు.


logo