ఆదివారం 29 మార్చి 2020
Medak - Jan 18, 2020 , 00:25:36

కొంగుబంగారం కొండపోచమ్మ

కొంగుబంగారం కొండపోచమ్మ


జగదేవ్‌పూర్‌ : పచ్చని పంటపొలాలు ఎత్తైన కొండలు పచ్చని చెట్ల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన కొండపోచమ్మ దేవాలయం జాతరకు ముస్త్తాబయింది. కొమురెల్లి మల్లన్నకు కోటిదండాలు కొండపోచమ్మకు ము క్కోటి దండాలు..తల్లి పోచమ్మకు శతకోటి దండాలు అంటు భక్తులు అమ్మవారిని ఇష్టంగా కొలుచుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండపోచమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. జాతర ఈ నెల  20 నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగనుంది.

కొండపోచమ్మ దేవాలయం జగదేవపూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌లో భక్తుల ఇలవేల్పుగా కోరిన కోరికలు తీరుస్త్తూ అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుంది.

 మల్లన్న దర్శించుకున్న భక్తులు.. కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. అలాగే, అమ్మవారిని దర్శించుకుంటే సంతానం ప్రాప్తిస్తున్న నమ్మకంతో వివిధ జిల్లాల నుంచి ప్రతి ఏడు జారతకు లక్షలాదిగా తరలివస్తున్నారు. 

ఆకట్టుకునే బోనాలు..

కొండపోచమ్మ జాతరకు వచ్చే భక్తులు ఆలయం ముం దున్న చెరువలో స్నానం ఆచరించి అమ్మవారికి నైవేధ్యం వండి సమర్పిస్తారు. అలాగే, రంగురంగుల పూలతో అలంకరించిన బోనాన్ని ఉరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్ట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం పోసి  సమర్పిస్తారు. తొట్టెలను, అమ్మవారి ప్రతిమలను ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు ముడుపులు కడుతారు. జాతరలో జోగిని శ్యామల బృందం చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి.

 ఆలయంలో ఏర్పాట్లు పూర్తి..

జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్‌ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రజితారమేశ్‌, ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు కార్పొరేషన్‌ చైర్మన్లకు ఆహ్వానం అందజేశా మన్నారు. జాతరకు కుషాయిగూడ, గజ్వేల్‌, సిద్దిపేట, జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని వివరించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా బందోబస్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిరాం తెలిపారు.

 జాతర ఏర్పాట్లపై ఏసీపీ పర్యవేక్షణ

 కొండపోచమ్మ ఆలయాన్ని ట్రాఫిక్‌ ఏసీసీ బాలాజీ, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, సీఐ కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐ సాయిరాం సందర్శించి ట్రాఫిక్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. logo