బుధవారం 08 ఏప్రిల్ 2020
Medak - Jan 16, 2020 , 23:19:36

అభివృద్ధికి చిరునామా..

అభివృద్ధికి చిరునామా..
  • -మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు
  • -కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణాభివృద్ధి
  • -ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు
  • -కొత్త రోడ్ల కోసం రూ.30 కోట్లు
  • -జంట మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు
  • -సమస్యలున్న ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి
  • -జిల్లా ఏర్పాటు తర్వాత మారిన మెదక్‌ పట్టణ రూపురేఖలు
  • -హర్షం వ్యక్తం చేస్తున్న మెదక్‌ పట్టణ ప్రజలు

 మెదక్‌ పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ మిగతా జిల్లా కేంద్రాలకు దీటుగా  ప్రగతిపథంలో దూసుకుపోతున్నది  .గతంలో జిల్లాపేరు మెదక్‌ ఉన్నప్పటికీ పరిపాలన మొత్తం సంగారెడ్డి కేంద్రంగా జరిగిన విషయం విదితమే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మెదక్‌ జిల్లా ఏర్పడటంతో అభివృద్ధికి మార్గం సుగమమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో  పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించగా, కొత్త రోడ్లు, మరమ్మతుల కోసం రూ.30 కోట్లు కేటాయించారు. జంట మినీట్యాంక్‌ బండ్‌ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. పట్టణంలోనూ ప్రతి గల్లిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేశారు. ఇలా సమగ్ర అభివృద్ధితో రూపుమారుతుండటంపై పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్‌ మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో మెదక్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ సమృద్ధిగా వనరులు ఉన్నా సరైన వసతులు లేక అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాగా ఉన్న మెదక్‌ ప్రాంతం కంటే సంగారెడ్డి, సిద్దిపేట పట్టణాలు బాగా ప్రగతి సాధించాయి. పేరుకు జిల్లా అయినా పాలనంతా సంగారెడ్డి నుంచే జరుగడంతో అభివృద్ధికి మెదక్‌ ఆమడదూరంలో ఉండిపోయింది. అయితే స్వరాష్ట్రం సిద్ధించాక కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా మెదక్‌ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో  ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడం ప్రారంభించింది.

రూపుమారిన మెదక్‌ మున్సిపాలిటీ...

జిల్లా కేంద్రంగా మారిన 2016 అక్టోబర్‌కు ముందు, ఆ తర్వాత మెదక్‌ను పరిశీలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. జిల్లా కేంద్రం అయిన మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం  పద్మాదేవేందర్‌రెడ్డి కోట్ల రూపాయల నిధులను వెచ్చించారు. ప్రధాన రహదారి నిర్మాణం కోసం రూ.50 కోట్లు, అంతర్గత రోడ్ల పునర్నిర్మాణం, కొత్త రోడ్ల కోసం రూ.30 కోట్లు, మిషన్‌ భగీరథ పథకం, మిషన్‌ కాకతీయ, జిల్లాలో ఎక్కడ లేని విధంగా జంట మినీ ట్యాంక్‌బండ్‌ల కోసం ప్రత్యేక నిధులు వెచ్చించి మెదక్‌ మున్సిపాలిటీ రూపురేఖలు మార్చారు. అలాగే నర్సాపూర్‌ చౌరస్తా నుంచి బోదన్‌ చౌరస్తా వరకు డివైడర్ల నిర్మాణం, బటర్‌ఫ్లై లైట్లను ఏర్పాటు చేశారు.

గల్లీ గల్లీకి అంతర్గత రోడ్లు...

మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాత 27 వార్డుల్లోనూ అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. వీటితో చాలా వరకు కాలనీల్లో రోడ్ల సమస్య తీరింది. డ్రైనేజీల నిర్మాణం కూడా చేపట్టడంతో మురుగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ప్రజల ఇబ్బందులు కూడా తప్పాయి. గత పాలకులు మరిచిన అభివృద్ధిని జిల్లా కేంద్రం ఏర్పాటు తర్వాత మెదక్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ పరుగులు పెట్టించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో నిధులను వెచ్చించి ఎక్కడ సమస్య ఉంటే ఆ ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి చేశారు. దీంతో ఆయా వార్డుల్లో చాలా కాలంగా పేరుకుపోయిన సమస్యలు తీరాయని ఆయా వార్డుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మా హయాంలోనే మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధి..

ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌
మా హయాంలోనే మెదక్‌ మున్సిపల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మున్సిపల్‌ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ముఖ్యంగా మిషన్‌ భగీరథ కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అంతేకాకుండా మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలను నిర్మించడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్ళ కల పెద్దబజార్‌ నుంచి నవాబుపేట వరకు రోడ్డు వెడల్పు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా పట్టణంలో ప్రధాన రహదారి నిర్మాణం కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు.

పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే..

రాగి అశోక్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌
మెదక్‌ పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే జరిగిందని మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో ఏ ఒక్క పని జరగలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రం ఏర్పాటైందని, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో పట్టణం నందనవనంలా మారిందని పేర్కొన్నారు.
logo