మంగళవారం 07 ఏప్రిల్ 2020
Medak - Jan 16, 2020 , 23:08:58

గ్రామాల్లో ‘పల్లెప్రగతి’ పనులు భేష్‌

గ్రామాల్లో ‘పల్లెప్రగతి’ పనులు భేష్‌

కొల్చారం : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లెప్రగతి’ చాలా బాగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జరిగిన పనులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ైప్ల్లెయింగ్‌ స్కాడ్‌, డీఐజీ షానవాజ్‌ ఖాసీం అన్నారు. కొల్చారం మండల పరిధిలోని అప్పాజిపల్లి, రాంపూర్‌లో గురువారం పల్లెప్రగతి పనులను ఎంపీడీవో వామనరావు, తహసీల్దార్‌ సహదేవ్‌తో కలిసి వీధులన్నీ తిరుగుతూ మురికి కాల్వలు, హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీలు, సెగ్రిగేషన్‌షెడ్‌ (డంప్‌యార్డు), క్రిమిటోరియం (వైకుంఠధామం) లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాల భవనాలను పరిశీలించారు.

అప్పాజిపల్లిలో దోమలు ఉన్నాయా? సర్పంచ్‌ గారు, ఏమేం రోగాలు వస్తున్నాయి.. అని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొందన్నారు. అలాగే గ్రామంలో ఏమైనా నేరాలు జరిగాయా? 100 కాల్‌సెంటర్‌ గురించి ఎంతవరకు ప్రజలకు తెలుసని సర్పంచ్‌ ఝాన్సీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. రాంపూర్‌లో మురికి కాల్వలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యంలో భాగంగా తడి, పొడి చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శి నగేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజు తెల్లవారు జాముననే మైక్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రచారాన్ని పరిశీలించారు. రోడ్ల పక్కన నాటిన మొక్కలు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో తిరుగుతూ పాఠశాలకు గదుల కొరత, బాలికల టాయిలెట్లు, పాఠశాల చుట్టూ ప్రహరీ అవసరమని గుర్తించారు.

రాంపూర్‌లో నిర్మిస్తున్న డంప్‌యార్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వైకుంఠధామం ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని సర్పంచ్‌ రాంరెడ్డిని అడిగారు. అనంతరం ైప్లెయింగ్‌ స్కాడ్‌ షానవాజ్‌ ఖాసీం మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో 50 మంది ైప్ల్లెయింగ్‌ స్కాడ్‌లను నియమించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలను అడిగి తెలుసుకుంటామన్నారు. ఇప్పుడు ఉన్న స్థితిగతులను పరిశీలిస్తున్నామని, అలాగే మరో మూడు నెలల తరువాత(ఏప్రిల్‌ నెలలో) మరోసారి వచ్చి చేపట్టిన పనులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, అలాగే సర్పంచ్‌లు కూడా ఉత్సాహవంతులుగా పనులు చేస్తున్నారని ప్రశంసించారు. ఇదే విధంగా పల్లెప్రగతిని కొనసాగించాలని సర్పంచ్‌లకు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి గణేశ్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌, ఏపీవో మహిపాల్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సుదర్శన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సత్యనారాయణ, బాల్‌రాజ్‌, మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌, మెదక్‌ టౌన్‌ ఎస్సై ఆంజనేయిలు, స్థానిక  ఏఎస్సై మోతీలాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo