బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Jan 14, 2020 , 02:26:15

బరిలో.. నిలిచేదెవరు..

బరిలో.. నిలిచేదెవరు..


నేడు తేలనున్న పార్టీ అభ్యర్థులు


-మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
-మెదక్‌ మున్సిపాలిటీలో రెండు వార్డులు గులాబీ ఖాతాలో...
-2వ వార్డు వేదవతిరాములు, 32వ వార్డులో గోదల మానససాయి అభ్యర్థులు ఏకగ్రీవం
-అదే బాటలో మరిన్ని వార్డులూ...

పురపోరులో నామినేషన్ల ఘట్టం ముగియగా, ఉపసంహరణకు నేడు తెర పడనున్నది. దీంతో బరిలో నిలిచేదెవరన్నది మంగళవారం 3గంటల తర్వాత తేటతెల్లం కానున్నది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం మెదక్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డు అభ్యర్థి వేదవతిరాములు, 32వ వార్డు అభ్యర్థి గోదల మానససాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మరికొన్ని వార్డులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారు స్పీడుకు ప్రత్యర్థి పార్టీలు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
            - మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పురపోరులో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. బరిలో నిలిచేదెవరు..? కదనరంగంలో దూకేదెవరు...? మధ్యాహ్నం మంగళవారం 3 గంటల తర్వాత తేటతెల్లం కానున్నది. సోమవారం మెదక్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డు, 32వ వార్డు లు ఏకగ్రీవమయ్యాయి. గులాబీ ఖాతాలో రెండు వార్డులు చేరాయి. 2వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి కుంటి లక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేదవతి రాములు ఏకగ్రీవమయ్యారు. 32వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సమ్మ, బీజేపీ అభ్యర్థి గోదల జ్యోతి, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి లక్ష్మి తన నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో గోదల మానససాయి ఏకగ్రీవంగా 32వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. జిల్లాలోని మెదక్‌, రామాయంపేటలోని మున్సిపల్‌ వార్డుల అభ్యర్థులను ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా వుండగా మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆశావహులు ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో అత్యధికులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదేశాల మేరకు పురపోరు నుంచి వెనక్కి తగ్గి పార్టీ నిర్ణయానికి శిరసావహించనున్నారు. ఇందుకోసం వార్డుల వారీగా వారం రోజుల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులకు వార్డుల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించి అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్యేల స్వీయ పర్యవేక్షణలో సాగిన సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగానే టికెట్లను ఖరారు చేశారు. ఆయా వార్డుల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల బలాలు, స్థానిక అంశాలకు తగ్గట్లుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలబెడుతున్నారు.

జనంలోకి నాయకులు..

ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీ బలాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. 5 సంవత్సరాల కిందట జరిగిన మున్సిపల్‌ ఎన్నికలకు నేటి పరిస్థితులకు భారీ తేడాలు వచ్చాయి. మెదక్‌ జిల్లా ఆవిర్భావంతో పాటుగా కొత్తగా మూడు మున్సిపాలిటీలు నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తదుపరి వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ కారు జోరుకు ప్రతిపక్షాలు కుదేలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మద్దతుదారులే విజయ ఢంకా మోగించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని సాధించగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరులోనూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 18 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించి మెదక్‌ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవైసిన విషయం తెలిసిందే. తాజాగా పురపోరులోనూ మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంగా జిల్లా నేతలు కృషి చేస్తున్నారు. గెలుపు సులువైనప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధిని, చేయబోయే కార్యక్రమాలను, కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఓట్లను అభ్యర్థించేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీల అభ్యర్థులను వార్డుల వారీగా ఎంపిక చేస్తున్నారు. త్వరలో వీరికి బీ-ఫాంలు అందజేయనున్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీల్లో ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. మెదక్‌ ఉమ్మడి జిల్లా సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డిని నియమించారు. పార్టీకి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి నివేదికను పార్టీ అధిష్టానానికి వెంటవెంటనే ఎమ్మెల్సీ అందించనున్నారు.

బీ-ఫాంలు పొందిన వారే అధికారికం..

టికెట్‌ వస్తుందన్న నమ్మకం ఉన్న వారు కొంత మంది నామినేషన్లు వేయగా, మరి కొందరైతే వచ్చే అవకాశం లేకున్నా ముందుకు వచ్చారు. మరికొన్ని వార్డుల్లో ముందస్తు జాగ్రత్త చర్యగా ఒకరిద్దరు డమ్మీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. అసలు అభ్యర్థి నామినేషన్‌ చివరి రోజు ఉపసంహరించుకుంటారని, అలా కాకుండా ఒక వేళ తిరస్కరణకు గురైతే రెండో వ్యక్తి పోరులో నిలుస్తారనే ఆశతో నామినేషన్లు వేసిన వారు లేకపోలేదు. ఎంత మంది నామినేషన్లు వేసి 14వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులకు ఎవరు పార్టీ బీ-ఫాం అందిస్తారో వారే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ అభ్యర్థికే ఆ పార్టీ గుర్తులను కేటాయిస్తారు. అలా కాకుండా పార్టీ పేరుతో నామినేషన్‌ వేసిన బీ-ఫాం రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా మిగిలి పోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి 14న గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు ఒక వార్డు నుంచి పోటీలో నిలిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. చుట్టాలు, బంధువులు, దగ్గరి మిత్రులు ఇలా అన్ని రకాల అస్ర్తాలను సందించి నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్నారు.

ఆనందంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు..

మెదక్‌ మున్సిపాలిటీలో రెండు వార్డులు అధికార పార్టీ కౌన్సిలర్లుగా ఏకగ్రీవం కావడంతో జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ నాయకులు ఏకగ్రీవమైన కౌన్సిలర్లను అభినందించారు. ఇదే తరహాలో మరిన్ని వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


logo
>>>>>>