సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Jan 13, 2020 , 03:22:04

మున్సిపాలిటీలకు భారీ ఆదాయం

మున్సిపాలిటీలకు భారీ ఆదాయంమెదక్‌ మున్సిపాలిటీ :మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 3 రోజులుగా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. మెదక్‌ మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 3రోజుల్లో సుమారు 300 పై చిలుకు నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నామినేషన్లు వేశారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నా వారు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లను సమర్పించారు.

మున్సిపాలిటీలకు భారీ ఆదాయం..

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. నిబంధనల ప్రకారం మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను, నల్లాబిల్లు, ఇతరత్రా పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీకి ఎలాంటి బాకీలు లేవని నిరభ్యంతర పత్రం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా పరిగణింపబడుతారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులు అందరూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించారు.

దీంతో ఒక్క మెదక్‌ మున్సిపాలిటీకి రూ.18లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఒక్కొక్క అభ్యర్థి సుమారు రూ.50వేల ఇంటి పన్ను చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా ఎన్నికల భరిలో ఉన్న అభ్యర్థులు ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించడంతో భారీగా ఆదాయం సమకూరింది. నూతనంగా మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తూప్రాన్‌ మున్సిపాలిటీకి సైతం భారీ ఆదాయం సమకూరింది. ఇక్కడ ఇంటి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుని సుమారు రూ.6లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీలో రూ.1.50లక్షల ఆదాయం, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో రూ.2లక్షల 50వేలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు రూ.28లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

నిరభ్యంతర సర్టిఫికేట్ల కోసం పోటాపోటీ..

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి అని ఎన్నికల నియమావళిలో పేర్కొనడంతో అభ్యర్థులు నో డ్యూస్‌ సర్టిఫికేట్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయాల దగ్గర బారులు తీరాల్సివచ్చింది. 3మూడు రోజుల్లో ఒక్క మెదక్‌ మున్సిపాలిటీలోనే సుమారు రూ.లక్షా 80వేల ఆదాయం సమకూరడం విశేషం. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో భారీగా ఆదాయం సమకూరడం పై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo