మంగళవారం 31 మార్చి 2020
Medak - Jan 13, 2020 , 03:16:15

మున్సిపల్‌ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
  • ఉమ్మడి మెదక్‌ జిల్లా సమన్వయ బాధ్యతల అప్పగింత

(సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి) : మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం కో-ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ఒకరికి సమన్వయ బాధ్యతలను అప్పగించింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాకరామారావు ఆదివారం కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి శుభాశ్‌రెడ్డికి  సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోల్‌-జోగిపేట తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి, అలాగే సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చెర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా, ఉపసంహరణల గడువు కొనసాగుతున్నది. అన్ని మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ నేతలంతా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్‌, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, రామాలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు ఫరిదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, ఇన్‌చార్జీలు బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవి ప్రసాద్‌, అటవీ సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ ఇతర నేతలంతా ఆయా మున్సిపాలిటీలలో నేతలను సమన్వయ పరుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు దిశానిర్దేశం చేశారు. కాగా మంత్రి హరీశ్‌రావు, పటాన్‌చెరు, జహీరాబాద్‌ల ముఖ్య నేతలతో ఎన్నికలపై సమీక్షించారు. ప్రస్తుతం రెబల్స్‌ను బుజ్జగిస్తుండగా, మిగతా నేతలు ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా, మొత్తం ఉమ్మడి జిల్లాకు మున్సిపల్‌ ఎన్నికల సమన్వయ కర్తగా శేరి సుభాశ్‌రెడ్డిని నియమించారు. ఆయన రోజు వారీగా ఎన్నికల ప్రక్రియను కూడా సమీక్షించనున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో అధికార పార్టీ ముందుకు సాగుతున్నది.


logo
>>>>>>