సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 12, 2020 , 00:48:32

నేటితో ముగియనున్న పల్లెప్రగతి

నేటితో ముగియనున్న పల్లెప్రగతి

మెదక్‌ మున్సిపాలిటీ :జిల్లాలో పల్లెప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. పల్లెప్రగతి 10వ రోజు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు కొనసాగాయి. పారిశుధ్యం, గతంలో పవర్‌డే సందర్భంగా ఆయా గ్రామాల్లో  మిగిలిపోయిన పనులను చేపట్టి పూర్తి చేసుకునేందుకు నడుం బిగించారు. వీధి లైట్లు ఏర్పాట్లతో పాటు కరెంటు మీటర్లను బిగించుట, వంగిన కరెంటు స్తంభాలు, వదులుగా ఉన్న కరెంటు వైర్లను సరిచేసుకున్నారు. కలుపు మొక్కలను తొలగించి రోడ్లను శుభ్రం చేశారు.
తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో రోడ్లను శుభ్రపరిచి, కలుపు మొక్కలను తొలగించారు. డంపుయార్డ్‌ల నిర్మాణం, తడి, పొడి చెత్తపై గ్రామప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా అధికారులతో పాటు మండల గ్రామ సర్పంచులతో పాటు అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలలో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగాయి.

నేడు గ్రామాల్లో గ్రామసభలు..

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 రోజులుగా కొనసాగిన పల్లెప్రగతి పండుగలో ఆదివారం జిల్లాలోని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామసభలో మహిళా సంఘాల సభ్యులు, వార్డుసభ్యులు, యూత్‌ సభ్యులు, ప్రజలు భాగస్వాములు పాల్గొననున్నారు.
10రోజులుగా గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఏఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం గ్రామసభను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్య, కరెంట్‌ సమస్య, రోడ్లను శుభ్రం చేయుట, కలుపుమొక్కలను తొలగించుట, గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటడం లాంటి పనులు చేయడం జరుగుతుంది.  


logo